టీటీడీ నూతన ఛైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి అవకాశం దక్కింది. ప్రస్తుతం టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి ఉండగా.. ఆయన స్థానంలో భూమన కరుణాకర్ రెడ్డిని సీఎం జగన్ నియమించారు. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో టీటీడీ ఛైర్మన్‌గా పనిచేసిన అనుభవం భూమన కరుణాకర్ రెడ్డికి ఉంది. దీంతో ఆయననైతేనే సమర్ధవంతంగా పనిచేస్తారనే కారణంతో సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. గత ఎన్నికల్లో తిరుపతి నుంచి వైసీపీ తరపున భూమన కరుణాకర్ రెడ్డి గెలవగా.. జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా ఆయనకు మంచి పేరు ఉంది.
వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి వైవీ సుబ్బారెడ్డినే టీటీడీ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. అయితే ఆయన స్థానంలో కొత్తవారికి జగన్ అవకాశం కల్పించనున్నారనే ప్రచారం గత కొద్దికాలంగా జరుగుతోంది. దీంతో రేసులో పలువురు నేతల పేర్లు వినిపించాయి. బీసీ నేతలకు టీటీడీ ఛైర్మన్‌గా అవకాశం ఇస్తారనే వార్తలు జోరుగా వినిపించాయి. పార్టీకి చెందిన వివిధ నేతలు టీటీడీ ఛైర్మన్ పదవి కోసం పోటీ పడ్డారు. టీటీడీ ఛైర్మన్ పదవికి ఉన్న గౌరవం దృష్ట్యా ప్రభుత్వ పెద్దల దగ్గర కూడా పదవి కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ చేశారు. కానీ చివరికి తొలి నుంచి పార్టీని నమ్ముకుని జగన్ వెంట నడుస్తున్న భూమన కరుణాకర్ రెడ్డినే ఆ పదవి వరించింది. రెండేళ్లపాటు టీటీడీ ఛైర్మన్ పదవిలో భూమన కొనసాగనున్నారు.
ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగానే కాకుండా టీటీడీ ఎక్స్‌అఫీషియా సభ్యుడిగా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి అత్యంత నమ్మినబంటుగా భూమనకు పేరుంది. కాంగ్రెస్ పార్టీతో భూమన రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004-06 వరకు తిరుపతి అర్బన్ డెవలప్‌మెంట్(తుడా) ఛైర్మన్‌గా, ఆ తర్వాత రెండేళ్లపాటు టీటీడీ ఛైర్మన్‌గా పనిచేశారు. 2009లో తిరుపతి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మెగాస్టార్ చిరంజీవిపై ఓడిపోయారు. వైఎస్ మరణాంతరం వైసీపీ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి జగన్ వెంటే ఉంటున్నారు. 2012లో జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ నుంచి తొలిసారి తిరుపతి ఎమ్మెల్యేగా గెలవగా.. 2014లో ఓటమి పాలయ్యారు. గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణపై కేవలం 708 ఓట్ల తేడాతో గెలుపొందారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో టీటీడీ ఛైర్మన్‌గా పనిచేయగా.. ఇప్పుడు తనయుడు జగన్ ప్రభుత్వంలో కూడా ఆ పదవి ఆయనను వరించింది. దీంతో టీటీడీ ఛైర్మన్‌గా నియమించినందుకు జగన్‌కు భూమన ధన్యవాదాలు తెలిపారు.