హరియాణాలోని నూహ్‌లో గతవారం విశ్వహిందూ పరిషత్ చేపట్టిన ఆధ్యాత్మిక యాత్ర సందర్భంగా ఘర్షణలు చెలరేగిన విషయం తెలిసిందే. అయితే, హింసాకాండతో నల్హార్ ఆలయంలో చిక్కుకున్న పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఈ ఆరోపణలను తాజాగా హరియాణా పోలీసులు ఖండించారు. ఇవన్నీ పుకార్లని, తప్పుడు కథనాలని పేర్కొన్నారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) మమతా సింగ్ ప్రకారం.. ఘర్షణల సమయంలో అలాంటి సంఘటన ఏదీ జరగలేదు ఎందుకంటే ఆ సమయంలో ఆమె అక్కడే ఉన్నారు.
‘నల్హార్ మందిర్‌లో భక్తులు ఇరుక్కుపోయిన సమయంలో అక్కడ కొంత మంది మహిళా భక్తులపై అత్యాచారం వంటి ఘోరమైన నేరాలకు పాల్పడ్డారని నిన్నటి నుంచి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇది తప్పుడు కథనాలు.. పూర్తి పుకార్లని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను’ అని మమతా సింగ్ విలేకరులతో అన్నారు. ఇలాంటి పుకార్లు పుట్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
‘ఈ సమయంలో నేను అక్కడ ఉన్నందున అధికారికంగా చెబుతున్నాను.. ఏ మహిళ విషయంలోనూ అలాంటిదేమీ జరగలేదు.. అసలు అక్కడ ఏం జరిగిందో మేం ఇప్పటికే క్లియర్ చేశాం.. ఇలాంటి పుకార్లు పుట్టించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఏడీజీపీ ఉద్ఘాటించారు. కాగా, హింసకు సంబంధించిన ఘటనల్లో ఇప్పటి వరకూ 216 మందిని అరెస్ట్ చేసినట్టు ఆమె తెలిపారు. రాష్ట్రంలో 216 మందిని అరెస్టు చేశామనిచ వీరిలో 83 మంది ముందస్తు అరెస్టయ్యారని ఆమె వివరించారు.
మరోవైపు, హరియాణా డీజీపీ పీకే అగర్వాల్ మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో కొన్ని పోస్టుల్లో చేసినట్టు అల్లర్ల వెనక పాకిస్థాన్ హస్తం లేదని స్పష్టం చేశారు. ‘లేదు.. అలాంటిదేమీ లేదు.. దీనిపై వెంటనే స్పందించడం సరికాదు.. మా వద్దకు వచ్చిన విషయాలపై విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని అగర్వాల్ తెలిపారు.
‘నేను అక్కడ పరిస్థితిని సమీక్షించాను.. శాంతిభద్రతల సమస్యల దర్యాప్తును వేగవంతం చేయడానికి, శాంతిభద్రతల పరిరక్షణకు నమోదైన కేసులకు సంబంధించి 145 అరెస్టులు, 55 కేసులు నమోదు చేశాం’ అని అన్నారు. మతపరమైన ఊరేగింపుపై దాడితో రెండు గ్రూపుల మధ్య ఘర్షణలు చెలరేగాయి, ఇద్దరు హోంగార్డులు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. డజన్ల కొద్దీ పోలీసుల సహా 80 మందికిపైగా గాయపడ్డారు. నిందితులపై కఠిన చర్యలు చేపట్టిన అధికారులు.. బుల్డోజర్ల సాయంతో వారి ఇళ్లు, దుకాణాలను కూల్చివేశారు.