ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటిస్తున్నారు. కూనవరంలో వరద బాధిత ప్రజలను పరామర్శించారు. వరద సహాయ, పునరావాస చర్యలను స్వయంగా స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులకు నిత్యవసరాలు అందించామని.. ఇళ్లు దెబ్బతిని ఉంటే రూ.10 వేలు ఇవ్వాలని ఆదేశించామన్నారు. అలాగే రూ. 2 వేలు ఆర్థికసాయం చేశామని గుర్తు చేశారు. గ్రామ సచివాలయాల్లో అర్హుల జాబితా ఉంచుతామన్నారు. కచ్చా ఇళ్లుగానీ, ఇళ్లు దెబ్బతినడం గానీ జరిగితే పార్షియల్లీ దెబ్బతినిందని, పూర్తిగా దెబ్బతినిందని వ్యత్యాసం వద్దని.. పేదవాడికి ఎటువంటి వ్యత్యాసం చూపించవద్దని, పూర్తిగా ప్రతి ఇంటికీ 10 వేలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. ఎన్యుమరేషన్ చేసే ఖాతాలోకి రాకపోయి ఉంటే అది కూడా తప్పేనన్నారు.
ఇటీవల వరదల వల్ల ఇళ్లలోకి నీళ్లు వచ్చిన కుటుంబాలకు కూడా రూ.2వేలు ఆర్థికసాయం అందిస్తామన్నారు సీఎం. కటాఫ్ అయిన ఇళ్లకు కూడా రేషన్ అందజేస్తామన్నారు. ఇప్పటికే వరద బాధితులకు 25 కేజీల బియ్య, కందిపప్పు, నూనె, కూరగాయలు అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ఒకవేళ వరద సాయం అందకుంటే ఇక్కడికి వచ్చి తనతో చెప్పొచ్చని.. ప్రతి ఒక్కరికి మంచి జరగాలన్నదే ఈ ప్రభుత్వ తాపత్రయం అన్నారు. డబ్బులు మిగుల్చుకోవాలనే ఆరాటం తమ ప్రభుత్వానికి లేదన్నారు.
వరద సాయం అందలేదని ఒక్క ఫిర్యాదు రాలేదని.. ఏ ఒక్క బాధితుడు మిగిలిపోకుండా సాయం అందించారన్నారు. అధికారులు నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. బాధితులందరికీ సాయం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని.. సహాయక చర్యల కోసం అధికారులకు తగిన సమయం ఇచ్చామన్నారు. నష్ట పరిహారం పక్కాగా అందేలా చర్యలు తీసుకున్నామని.. అధికారులు వారంపాటు గ్రామాల్లోనే ఉన్నారన్నారు.
పోలవరం నిర్మాణంలో తమ ప్రభుత్వం క్రెడిట్ కోసం ఆలోచించదు అన్నారు. ప్రజలకు న్యాయం చేయడమే తమ సంకల్పమన్నారు. ఆర్&ఆర్ విషయంలో కేంద్రం నిధులకు తోడు రాష్ట్రం నిధులు అందజేస్తామన్నారు. పోలవరం ముంపు బాధితుల పునరావాస ప్యాకేజీ పారదర్శకంగా అమలు చేస్తామని.. పునరావాస ప్యాకేజీకి త్వరలోనే కేంద్రం ఆమోదం తెలుపుతుందన్నారు. పోలవరం పరిహారం కేంద్రం స్వయంగా చెల్లించినా పర్లేదని.. బాధితులకు రావాల్సిన ప్యాకేజ్‌పై మంచి జరుగుతుందన్నారు.
ప్రతి నిర్వాసిత కుటుంబానికి న్యాయపరమైన ప్యాకేజీ అందుతుందన్నారు సీఎం. ముంపు ప్రాతాల్లో లీడార్ సర్వే ద్వారా అందరికీ న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు. మూడు దశల్లో పోలవరం డ్యాంలో నీళ్లు నింపుతామని.. ఒక్కసారిగా నింపితే డ్యామ్ కూలిపోవచ్చన్నారు. సీడబ్ల్యూసీ నిబంధనల ప్రకారం పోలవరం డ్యాంలో నీళ్లు నింపుతామని.. సెంట్రల్ వాటర్ కమిషన్ ఆదేశాల ప్రకారమే ముందుకెళ్తున్నామన్నారు. పోలవరం నిర్మాణంలో చంద్రబాబు బుద్ధిలేకుండా వ్యవహరించారని విమర్శించారు.
ముఖ్యమంత్రి జగన్ కూనవరం, వీఆర్‌పురం మండలాల బాధిత గ్రామాల ప్రజలతో మాట్లాడి.. అనంతరం కుక్కునూరు మండలం గొమ్ముగూడెంలో వరద బాధితులతో మాట్లాడనున్నారు. సాయంత్రానికి రాజమహేంద్రవరం చేరుకుని.. ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో భేటీ అవుతారు.. రాత్రికి అక్కడే బసచేయనున్నారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించి.. వరద బాధితులతో నేరుగా మాట్లాడనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa