చిత్తూరు జిల్లా పుంగనూరు ఘర్షణ కేసుల్లో అరెస్టయిన టీడీపీ నాయకులకు, వారి కుటుంబీకులకు ధైర్యం చెప్పేందుకు మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు పుంగనూరులో పర్యటించారు. తొలుత పుంగనూరు కోర్టులో రిమాండ్ కోసం జడ్జి ఎదుట హాజరుపరచడానికి పోలీసులు తీసుకెళ్లిన టీడీపీ శ్రేణులను పలకరించారు. ఇంకా చాలా మంది పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నారని చెప్పడంతో అక్కడికి వెళ్లి ఇన్‌చార్జి సీఐ అశోక్‌కుమార్‌తో మాట్లాడారు. అరెస్టు చేసిన తమ పార్టీ శ్రేణులను 24 గంటలవుతున్నా కోర్టులో ఎందుకు హాజరు పరచలేదని ప్రశ్నించారు. కార్యకర్తలెవరూ అధైర్యపడవద్దని, టీడీపీ అండగా నిలుస్తుందని ధైర్యం చెప్పారు. ఇదిలావుంటే, పుంగనూరులో జరిగిన గొడవలకు సంబంధించి పోలీసులు 71మందిని అరెస్టు చేసి రిమాండు నిమిత్తం జైలుకు తరలించారు. వీరిలో 13 మందిని చిత్తూరు జైలుకు తరలించారు. మరో 58 మందిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు.