జలపాతాన్ని చూసేందుకు వచ్చిన ఓ కుటుంబం తమ వాహనాన్ని జలపాతానికి సమీపంలో నిలిపి ఉంచినా.. హ్యాండ్ బ్రేక్ వేయకపోవడంతో దానంతట అదే కదలిపోయింది. అకస్మాత్తుగా జలపాతంలోకి జారిపోయింది. ఆ కారులోని ఉన్న తండ్రీకూతుళ్లు ప్రాణభయంతో కేకలు వేయగా.. అక్కడున్నవారు జలపాతంలోకి దూకి కాపాడారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగర సమీపంలోని లోహియా కుంద్ జలపాతం వద్ద ఆదివారం సాయంత్రం చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే.. ఇండోర్ నగరానికి 60 కిలోమీటర్ల దూరంలోని సిమ్రోల్ వద్ద లోహియా కుంద్ జలపాతాన్ని చూడటానికి ఓ కుటుంబం ఆదివారం సాయంత్రం కారులో బయలుదేరి వెళ్లింది. అక్కడకు చేరుకున్న తర్వాత తమ వాహనాన్ని జలపాతానికి సమీపంలో పార్క్ చేశారు. కానీ, హ్యాండ్ బ్రేక్ వేయకపోవడం వల్ల కొద్దిసేపటి తర్వాత వాహనం దానంతట అదే అకస్మాత్తుగా జలపాతం వైపు జారిపోయింది. అందరూ చూస్తుండగానే కారు జలపాతంలో పడిపోయింది. అందులోని ఉన్న తండ్రీకుమార్తెలు ప్రాణభయంతో కేకలు వేయడంతో అక్కడున్నవారు కాపాడారు. ప్రస్తుతం వారిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
క్షణాల్లో సునీల్ మాథ్యూ అనే యువకుడు జలపాతంలో దూకి కారులో ఉన్న తండ్రీకూతుళ్లను బయటకు తీశాడు. ‘జలపాతంలో కారు పడిపోవడం చూశాను.. వాహనం జారిపోతున్నప్పటికీ కారులో ఉన్న ఇద్దరూ దిగేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇద్దరూ లోపల ఉండగా కారు పడిపోయింది.. వారు జలపాతంలో మునిగిపోతున్నారు.. నేను వెంటనే దూకి కారులో ఉన్న అతడ్ని రక్షించాను.. ఆయన 13 ఏళ్ల కుమార్తెను అక్కడున్న మరికొందరు కాపాడారు..నేను సంఘటన చూసి షాక్‌కి గురయ్యాను, కానీ వెంటనే తేరుకుని ధైర్యం కూడగట్టుకుని లోపలికి దూకాను’ అని సునీల్ చెప్పారు. వారిని రక్షించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అయితే, కారు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఇండోర్ రూరల్ ఎస్పీ సునీల్ మెహతా అన్నారు.‘ జలపాతానికి అతి సమీపంలో కారును నిర్లక్ష్యంగా నిలిపారు.. లాక్ చేసిన తర్వాత సడెన్‌గా ముందుకు కదలడం ప్రారంభించి, జలపాతంలో పడిపోయింది’ అని తెలిపారు.