ఆంధ్రప్రదేశ్‌లో ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ద్వారా ఇంటి ముంగిటకే వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ వెల్లడించారు. రాజ్యసభలో మంగళవారం వైయస్ఆర్ సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి అందిన సమాచారం ప్రకారం డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పథకం కింద నెలకొల్పిన 6-7 వెల్‌నెస్ సెంటర్లకు కలిపి ఇద్దరేసి వైద్యాధికారులు అందుబాటులో ఉంటారు. ఒక్కో వైధ్యాధికారి నెలలో రెండు పర్యాయాలు ఈ వెల్‌నెస్ సెంటర్లను సందర్శించి గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డాక్టర్ వైయస్ఆర్ హెల్త్ స్కీంను కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్యశ్రీ యోజన పథకంతో జోడించి అమలు చేస్తోందని మంత్రి తెలిపారు. ఈ ఇంటిగ్రేటెడ్ స్కీం కింద అర్హులైన మొత్తం 1.41 కోట్ల కుటుంబాల్లో 61.47 లక్షల కుటుంబాలకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్త సహకారంతో హెల్త్ కవరేజ్ అందుతుండగా మిగిలిన 80.23 లక్షల కుటుంబాలకు కవరేజ్‌ను రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే భరిస్తోందని అన్నారు.