టీడీపీ అధినేత చంద్రబాబు అధికారం కోసం ఎంతకైనా తెగిస్తారని వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు పక్కా స్కెచ్‌తోనే పుంగనూరులో రెక్కీ చేయించారని సీరియస్ అయ్యారు. పుంగనూరు ఘటనలో చంద్రబాబు ఏ1 ముద్దాయి.. చంద్రబాబు రౌడీయిజం, బరితెగింపు పాల్పడినట్టు తెలిపారు. అధికారం లేకపోతే అదే పోలీసులపై అరాచకం చేస్తారా? అని ప్రశ్నించారు. పేర్ని నాని మంగళవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడు. చంద్రబాబు బరితెగించి వ్యవహరిస్తున్నాడు. 40ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు రౌడీమూకలతో యాత్రలు చేస్తున్నాడు. రాళ్లు, కర్రలు, తుపాకులు తీసుకుని వస్తున్నారు. పుంగనూరులో ముందు రోజే కర్రలు, రాళ్లు తెచ్చిపెట్టుకున్నారు. ఈ దాడిలో పదిమంది పోలీసులనైనా చంపాలనే కుట్ర చేసినట్లు రుజువైంది. అంగళ్లులో ఆయాసం.. పుంగనూరులో రౌడీవేషం ఇదీ చంద్రబాబు వైఖరి. రాష్ట్రంలో రావణకాష్టం సృష్టించాలని చంద్రబాబు ప్రయత్నించారు.