దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పోలవరం ప్రాజెక్టును ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు చెప్పారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కళ్లార్పకుండా అసత్యాలు వల్లిస్తున్నారని మండిపడ్డారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, అప్రోచ్ ఛానల్, పైలెట్ ఛానల్, స్పిల్ ఛానల్, స్పిల్‌వేని పూర్తి చేయకుండా, నీళ్లు మళ్లించకుండా డయాఫ్రమ్ వాల్‌ను నిర్మించడం చంద్రబాబు చేసిన చారిత్రక తప్పిదమన్నా రు. నిర్మాణంలో జాప్యానికి చంద్రబాబు నిర్వాకాలే కారణమన్నారు. ఈ కారణంగానే 2019, 2020 వరదలకు డయాఫ్రమ్‌వాల్ దెబ్బతిందన్నారు. ప్రాజెక్టులు, వ్యవసాయంపై చిత్తశుద్ధి లేని చంద్రబాబు ఎన్నికల భయంతో పర్యటనలు తలపెట్టారని విమర్శించారు. పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఈఎన్‌సీ నారాయణరెడ్డి, సీఈ సుధాకర్‌బాబులతో కలిసి పనుల పురోగతిని పరిశీలించారు. స్పిల్‌వే, ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ ప్రాంతాల్లో పర్యటించారు. ఎవరి హయాంలో ఎప్పుడెలా పనులు జరిగాయో నాడు–నేడు ఫొటో ఎగ్జిబిషన్ ద్వారా వివరించారు. పోలవరం పనులు ఎక్కడా ఆగలేదని మంత్రి అంబటి స్పష్టం చేశారు.