తిరుపతి పరిధిలోని తొట్టంబేడు మండల పరిషత్ కార్యాలయం దగ్గర నామినేషన్ల పరిశీలనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. పెన్నలపాడు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థులుగా తెలుగుదేశం పార్టీ తరపున రాజమ్మ, విజయమ్మ నామినేషన్లు దాఖలు చేశారు. నామినేషన్ల పరిశీలనకు టీడీపీ అభ్యర్థులను కార్యాలయం లోపలకు పోలీసులు అనుమతించలేదు. కార్యాలయం బయట ఓ వైపు టీడీపీ శ్రేణులు, మరోవైపు వైసీపీ శ్రేణులు మోహరించారు. లోపలికి పంపించాలంటూ పోలీసులతో టీడీపీ నేతల వాగ్వివాదానికి దిగారు. ఇరు పార్టీల నేతల రాకతో కార్యాలయం బయట పరిస్థితులు ఉధృతంగా మారాయి. నామినేషన్ల పరిశీలనకు అభ్యర్థులను కార్యాలయం లోపలికి పంపించాలని టీడీపీ నేతలు పట్టుబట్టారు. ఎట్టకేలకు న్యాయవాదితో కలిసి కార్యాలయం లోపలకు వెళ్లేందుకు పోలీసులు అనుమతించారు. ఇదిలా ఉంటే అభ్యర్థుల సమక్షంలో నామినేషన్ల పరిశీలనకు ఎన్నికల అధికారి రాఘవేంద్ర నిరాకరించారు. అధికారులు, పోలీసులు వైసీపీకి తలొగ్గి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.