తన ఇంటి ఆవరణలో పనిచేసుకుంటోన్న ఓ మహిళ భయానక అనుభవాన్ని ఎదుర్కొంది. ఊహించని రీతిలో ఆకాశం నుంచి ఓ పాము వచ్చి పడింది. దాన్ని విదిలించుకునే ప్రయత్నం చేస్తుండగా.. ఇంతలో ఓ డేగ దూసుకొచ్చింది. పట్టుజారిన తన ఆహారాన్ని తిరిగి తీసుకోడానికి ఆ డేగ దాడి చేసింది. చేతిని చుట్టేసిన పాము ఓ వైపు... తన ఆహారం కోసం డేగ మరోవైపు దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ భయంకర అనుభవం అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన పెగీ జోన్స్ (64) అనే మహిళకు ఎదురైంది.
సిల్సిబీకి చెందిన పెగీ జోన్స్ తన భర్తతో కలిసి ఇంటి వెనుక యార్డులో పని చేసుకుంటున్నారు. ఇంతలోనే ఆకాశం నుంచి ఒక పాము వచ్చి ఆమె కుడిచేతిపై పండింది. నాలుగున్నర అడుగుల పొడవైన ఆ పాము మోచేతికి బలంగా చుట్టుకుంది. ఈ హఠాత్పరిణామానికి షాక్ తిన్న ఆమె.. తన చేతిని విదిలిస్తూ భయంతో కేకలు వేశారు. అయినప్పటికీ.. చేతిని వీడని ఆ సర్పం జోన్స్ ముఖంపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ సమయంలో దూసుకొచ్చిన ఓ డేగ.. గాల్లో చేజారిన తన ఆహారాన్ని లాక్కునేందుకు తన కాళ్లను విదిల్చింది.
పామును తిరిగి లాక్కెల్లే క్రమంలో ఆ డేగ.. గోళ్లతో రక్కి దాడి చేయడంతో ఆమె చేతికి గాయాలయ్యాయి. ఒకానొక దశలో తన చేతిని ఆ డేగ కాళ్లతో బలంగా పట్టుకుని ఎగిరేసుకుపోయే ప్రయత్నం చేసిందని ఆమె తెలిపారు. చివరకు ఆ పామును చేజిక్కించుకుని అక్కడ నుంచి ఎగిరిపోయింది. ఒకవైపు పాము.. మరోవైపు డేగ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ షాక్‌లోకి వెళ్లిపోయారు. వెంటనే ఆమెను భర్త ఆస్పత్రికి తరలించి, చికిత్స అందించారు.
బాధితురాలు న్యూయార్క్ టైమ్స్‌తో మాట్లాడుతూ.. ‘నేను వెంటనే అరిచి పామును విదిలించుకోడానికి నా కుడిచేయి గట్టిగా ఊపాను.. నాకు సహాయం చేయి, దయచేసి, నాకు సహాయం చేయి అని జీసస్‌ను వేడుకున్నాను.. పాము చాలా గట్టిగా బిగుసుకుంటోంది.. నేను గాలిలో చేతులు ఊపుతున్నాను.. పాము నా మొహంపై దాడికి దిగింది.. నా కళ్లద్దాలు ఒకటికి రెండు సార్లు తగిలింది.’ అని చెప్పారు.
‘ఇది చాలా భయానక అనుభవం. నా చేయి మొత్తం రక్తంతో నిండిపోయింది. పాము దాడిలో నా కళ్లద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ ఘటనను మర్చిపోలేకపోతున్నా.. నిద్రకూడా పట్టడం లేదు.. అదే కళ్లముందు కదుళ్తోంది.. తినడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పీడకలలు వస్తున్నాయి.. ఏదేమైనా నేను అదృష్టవంతురాలిని.. కానీ, జీవితాంతం ఇది గుర్తుండిపోతుంది’ అని పెగీ జోన్స్ తన అనుభవాన్ని వివరించారు.