పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. పెంటపాడు మండలం మీన వల్లూరులో అదృశ్యమైన వెంకట కళ్యాణ్ అనుమానాస్పద స్థితిలో ఓ డ్రెయిన్‌లో శవమై తేలాడు. మీనవల్లూరుకు చెందిన ఆరేళ్ల పోకల వెంకట కళ్యాణ్ ఈ నెల 9న కనిపించకుండా పోయాడు. తన కుమారుడి ఆచూకీ లభ్యం కాలేదని తల్లి శిరీష అదే రోజు రాత్రి పెంటపాడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం గణపవరం మండలం కోమర్రులోని ముత్యాలమ్మతల్లి గుడికి సమీపంలో యనమదుర్రు డ్రెయిన్‌లో బాలుడి మృతదేహాన్ని గుర్తించారు. ఈ కేసులో ఆస్తి ఆస్తి తన కుమారుడికి దక్కకుండా పోతుందనే ఉద్దేశంతోనే తాతే కళ్యాణ్‌ను హత్య చేశాడని తల్లి శిరీష ఆరోపించారు.
మీనవల్లూరుకు చెందిన పోకల నాగేశ్వరరావుకు కుమారుడు సత్యనారాయణకు పదేళ్ల క్రితం.. ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం రామన్నగూడేనికి చెందిన శిరీషతో వివాహం చేశారు. వీరిది వ్యవసాయ కుటుంబం.. సత్యనారాయణ, శిరీషలకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు వెంకట కళ్యాణ్ అత్తిలి మండలం బల్లిపాడులో ఓ ప్రైవేటు కాలేజీలో ఎల్‌కేజీ చదువుతున్నాడు. ఇటీవల సత్యనారాయణ, శిరీషల మధ్య విభేదాలు వచ్చాయి. పెద్దలు రాజీ కుదిర్చినా లాభం లేకుండా పోయింది.
ఈ క్రమంలో తాను భర్త సత్యానారయణతో విడిపోతే.. మామ నాగేశ్వరరావు పేరు మీద ఉన్న ఆస్తి అంతా తన మనవడికే వెళ్లిపోతుందనే అనుమానాలు మొదలయ్యాయి అన్నారు శిరీష. అదే జరిగితే సత్యనారాయణకు అన్యాయం జరుగుతుందని భావించిన నాగేశ్వరరావు మనవడ్ని అడ్డు తొలగించుకున్నట్లు కళ్యాణ్ తల్లి ఆరోపించారు. ఈ నెల 9న ఉదయం స్కూల్‌కు వెళ్తున్న తన మనవడిని మార్గమధ్యంలో నాగేశ్వరరావు బైక్‌పై ఎక్కించుకుని మీనవల్లూరు శివారులోకి తీసుకెళ్లి హత్యచేసి యనమదుర్రు డ్రెయిన్‌లో పడేసినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నాడు. నాగేశ్వరరావు కుమారుడు సత్యనారాయణ పోలీసుల అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.