టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రస్తుతం పల్నాడు జిల్లాలో జరుగుతోంది. ఇవాళ పెదకూరపాడు నియోజకవర్గంలో కొనసాగుతుండగా.. ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివస్తున్నారు. లోకేష్‌ను చూసేందుకు, సెల్పీలు దిగేందుకు దారిపోడవునా ప్రజలు ఎగబడుతున్నారు. పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ నేతలందరూ పాదయాత్రలో లోకేశ్ వెంట నడుస్తున్నారు.
అయితే పెదకూరపాడులో లోకేష్ పాదయాత్రలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. లోకేష్‌కు ఘన స్వాగతం పలుకుతూ పవన్ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. లోకేష్, పవన్ కల్యాణ్‌ల ఫొటోలతో పెద్ద ఎత్తున దారిపోడవునా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. లోకేష్‌తో పాటు పవన్ కల్యాణ్ ఫొటో కూడా ఉండటంతో అందరినీ ఆకర్షించింది. ఫ్లెక్సీల మీద లోకేష్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఫొటోలతో పాటు ఫ్లెక్సీపై ఒక మూలన జనసేన పార్టీ అని కూడా రాసి ఉంది. ఒక ఫ్లెక్సీలో ఒకవైపు లోకేష్ ఫొటో, మరోవైపు పవన్ ఫొటో ఉంది.
'జనం కోసం లోకేష్ ప్రయాణం.. లోకేష్ కోసం మా ప్రయాణం.. యువగళం పాదయాత్ర కోసం వస్తున్న లోకేష్‌కు స్వాగతం-సుస్వాగతం' అని రాసి ఉంది. ఇక మరో ఫొటోలో చంద్రబాబు, పవన్, లోకేష్ ముగ్గురి ఫొటోలు ఉండగా.. పవన్ ఫొటోపైన జనసేన పార్టీ అని రాసి ఉంది. యువగళం పాదయాత్రను చూసేందుకు వచ్చినవారిని ఈ ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. ఒకే ఫ్లెక్సీలో లోకేష్, పవన్ ఫొటోలు ఉండటంతో అందరూ ఆసక్తిగా తిలకిస్తున్నారు. యువగళం ఫ్లెక్సీలలో పవన్ కల్యాణ్ ఫొటో ఏంటి? అంటూ కొంతమంది చర్చించుకుంటున్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని పొడపాడు వద్ద ఈ ఫ్లెక్సీలు వెలిశాయి.
అయితే లోకేష్‌కు స్వాగతం పలుకుతూ పవన్ కల్యాణ్ ఫాన్స్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం ఇది తొలిసారి కాదు. గతంలోనూ చంద్రగిరి నియోజకవర్గంలో లోకేష్, చంద్రబాబు, పవన్ ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అలాగే పలుచోట్ల యువగళం పాదయాత్రలో పవన్ కల్యాణ్ అభిమానులు పాల్గొని మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయనే వార్తల క్రమంలో ఇలాంటి దృశ్యాలు ఇంట్రెస్టింగ్‌గా మారుతున్నాయి. కాగా త్వరలో గుంటూరు జిల్లాలోకి లోకేష్ పాదయాత్ర అడుగుపెట్టనుండగా.. మంగళగిరిలో 'హలో లోకేష్' కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. లక్ష మంది యువకులతో ఈ కార్యక్రమం చేపట్టేలా ప్లాన్ చేస్తున్నారు. పక్క నియోజకవర్గాల నుంచి కూడా యువకులను తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో యువకులు అడిగే ప్రశ్నలకు లోకేష్ సమాధానాలు చెప్పనున్నారు.