ప్రస్తుత జీవన విధానంలో చాలామందికి ఏదో ఒక ఆరోగ్య సమస్య ఉంటోంది. దీంతో ప్రతీ ఒక్కరు డాక్టర్ల వద్దకు వెళ్తున్నారు. వారి రాసిన మందులను వేసుకుంటూనే ఉన్నారు. అయితే ఈ మందుల ధరలు ఎక్కువగా ఉండటంతో సామాన్యుల జేబుకు చిల్లు పడుతోంది. క్రమం తప్పకుండా మందులు వేసుకోవాల్సి ఉండటంతో నెల నెలా బడ్జెట్ భారంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోగులకు జనరిక్ మందులనే రాయాలని డాక్టర్లకు సూచిస్తోంది. ప్రజలకు కూడా ఈ జనరిక్ మందుల వాడకంపై విస్తృత అవగాహన కల్పిస్తోంది. డాక్టర్లు కూడా ఈ జనరిక్ మందులనే రోగులకు రాయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఈ జనరిక్ ఔషధాలు సాధారణంగా మెడికల్ దుకాణాల్లో దొరికే మందుల కంటే చాలా తక్కువ ధరకు లభిస్తాయి. ఫార్ములా ఒకటే ఉండి.. వాటిని ఉత్పత్తి చేసే కంపెనీలు వేర్వేరుగా ఉంటాయి. అందుకే ఈ జనరిక్ మందులను తీసుకువచ్చి ప్రజలు అధిక ధరలకు మందులు కొనుగోలు చేసి.. ఆర్థికంగా మరింత ఇబ్బందుల్లో పడకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే ఈ ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ జనరిక్ మందుల వాడకంపై ప్రజల్లో కూడా అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా రోగులకు జనరిక్ మందులనే సూచించాలని డాక్టర్లకు ఆదేశాలు జారీ చేస్తూ కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. వైద్యులు తమ వద్దకు వచ్చే రోగులకు చౌకగా లభించే జనరిక్ ఔషధాలనే రాయాలని.. లేదంటే సదరు డాక్టర్లపై చర్యలు తప్పవని హెచ్చరించింది. అవసరమైతే వారి లైసెన్సును కూడా సస్పెండ్ చేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి నేషనల్ మెడికల్ కమిషన్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్స్ పేరుతో కొత్త నిబంధనలు జారీ చేసింది.
దేశంలోని ప్రతి వైద్యుడు జనరిక్ మందులనే రోగులకు సూచించాలని 2002లో ఇండియన్ మెడికల్ కౌన్సిల్ నిబంధనలు జారీ చేసింది. అయితే అలా కాకుండా ఇష్టం వచ్చిన మందులను రాసే వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేది అందులో పేర్కొనలేదు. దీంతో డాక్టర్లు తమకు నచ్చిన మందులను రాయడంతో రోగుల జేబులు గుల్ల అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆ నిబంధనల స్థానంలో ఎన్‌ఎంసీఆర్‌ఎంపీ నియమావళి-2023 అమల్లోకి తెచ్చినట్లు జాతీయ వైద్య కమిషన్ వెల్లడించింది. ఇందులో నిబంధనలను పాటించని వైద్యులపై తీసుకునే చర్యలను కూడా సవివరంగా పేర్కొన్నారు. దీని ప్రకారం ప్రతి రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టిషనర్ తమ వద్దకు వచ్చే రోగులకు జనరిక్ పేర్లతో ఔషధాలను రాయాలని.. అనవసర మందులు, అహేతుకమైన ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ ట్యాబ్లెట్లను సూచించకూడదని నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు. వీటిని డాక్టర్లు ఉల్లంఘిస్తే.. హెచ్చరించడంతో పాటు వర్క్‌షాపులకు హాజరయ్యేలా ఆదేశాలు జారీ చేయనున్నారు. ఒకవేళ పదే పదే నిబంధనల ఉల్లంఘిస్తే ఆ వైద్యుడి లైసెన్సును సస్పెండ్ చేయనున్నట్లు కొత్త నిబంధనలు జారీ చేశారు.
మరోవైపు.. వైద్యులు రాసే మందుల చీటీలో ఔషధాల పేర్లను క్యాపిటల్ అక్షరాల్లో రాయాలని జాతీయ వైద్య కమిషన్ తాజా నిబంధనల్లో పేర్కొంది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యక్తీ తన సంపాదనలో అధికభాగం ఆరోగ్యం కోసమే ఖర్చు చేయాల్సి వస్తోంది. సాధారణ ఔషధాలతో పోలిస్తే జనరిక్ మందుల ధరలు 30 నుంచి 80 శాతం తక్కువగా ఉంటాయి. ఈ నేపథ్యంలోనే డాక్టర్లు జనరిక్ మందులను సూచించడం ద్వారా ఖర్చులు తగ్గి.. ప్రజలందరికీ నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించినట్లవుతుందని నేషనల్ మెడికల్ కమిషన్ తాజా నిబంధనల్లో వెల్లడించింది.