ఏపీ హైకోర్టులో టీడీపీ నేతలకు ఊరట లభించింది. టీడీపీ అధినేత చంద్రబాబు పుంగనూరు పర్యటన సందర్భంగా అంగళ్లులో జరిగిన ఘటనలపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ముదివీడు పోలీసులు నమోదు చేసిన కేసులో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు, పీలేరు టీడీపీ ఇంఛార్జ్ నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డిలకు రిలీఫ్ దక్కింది. వారిద్దరిని సోమవారం వరకు అరెస్టు చేయవద్దని పోలీసులకు హైకోర్టు సూచించింది. ఈ కేసులో తమకు ముందస్తు బెయిలు మంజూరు చేయాలని కోరుతూ దేవినేని ఉమా, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.
పిటిషనర్లపై తప్పుడు కేసు నమోదు చేశారని, హత్యాయత్నం వంటి తీవ్ర సెక్షన్లు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారని పిటిషనర్ల తరఫున లాయర్లు వాదనలు వినిపించారు. పిటిషనర్లపై తప్పుడు కేసులు నమోదు చేశారని పిటిషనర్లపై ఐపీసీ సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసేందుకు ఎలాంటి అంశాలు లేవన్నారు. వారికి ముందస్తు బెయిలు ఇవ్వాలని కోరారు. రికార్డులను తెప్పించుకొని పరిశీలించాల్సి ఉందని.. పూర్తి వివరాలు సమర్పించడానికి విచారణను సోమవారానికి వాయిదా వేయాలని పోలీసుల తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టును కోరారు.
అయితే ఈలోపు అరెస్టు చేసే ప్రమాదం ఉందని పిటిషనర్ల తరఫు లాయర్లు ఆందోళన వ్యక్తం చేయగా.. సోమవారం వరకు అరెస్టు చేయబోమని హైకోర్టుకు అదనపు ఏజీ తెలిపారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకుని విచారణను సోమవారానికి వాయిదా వేశారు. అప్పటి వరకు పిటిషనర్లను అరెస్టు చేయొద్దని కోరారు. వారిని పోలీసులు అరెస్ట్ చేసే ప్రమాదం ఉందన్నారు. వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించారు. ఈ వ్యవహారానికి సంబంధించి వివరాలు తెప్పించుకోవాల్సి ఉందని విచారణను సోమవారానికి వాయిదా వేయాలని ఏఏజీ కోరారు.
పుంగనూరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో నమోదైన కేసుల బాధిత కుటుంబాలతో చంద్రబాబు మాట్లాడారు. అంగళ్లు, పుంగనూరులలో ఘటనల్లో పార్టీ అధినేత చంద్రబాబుతో సహా వందల మంది టీడీపీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు 12 ఎఫ్ ఐఆర్ లు నమోదు చేయగా.. 317 మందిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ లతో కేసులు నమోదు చేసినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే 81 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారన్నారు.
ఈ అరెస్టులతో టీడీపీ నేతలు, కార్యకర్తల కుటుంబసభ్యుల ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో చంద్రబాబు అరెస్టైన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులతో ఫోన్ లో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ పూర్తి అండగా ఉంటుందని.. తప్పుడు కేసులు కోర్టులలో నిలబడవన్నారు. న్యాయం పోరాటం ద్వారా అందరినీ విడుదల చేయిస్తామని చెప్పారు చంద్రబాబు. కార్యకర్తల అక్రమ అరెస్టులు తనను ఎంతో బాధించాయని.. న్యాయ పోరాటం ద్వారా వారందరినీ సాధ్యమైనంత త్వరగా బయటకు తెస్తామన్నారు. అక్రమ కేసులతో వందల కుటుంబాల క్షోభకు కారణం అయిన ప్రతి ఒక్కరు రానున్న రోజుల్లో మూల్యం చెల్లిస్తారన్నారు. ఆయా గ్రామాల్లో కుటుంబ సభ్యుల అరెస్టులతో తల్లడిల్లుతున్న వారికి ఒక తండ్రిలా తాను అండగా ఉంటానన్నారు.