రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే ముఖ్య గమనిక జారీ చేసింది. విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లను రద్దు చేసింది. భద్రతా పరమైన పనులు జరుగుతున్న కారణంగా కొన్నింటిని రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను దారి మళ్లించనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే వెల్లడించింది. ఈ నెల 14వ తేదీ నుంచి 20వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేసింది.
కాకినాడ-విశాఖపట్నం, విశాఖపట్నం-కాకినాడ, రాజమండ్రి-విశాఖపట్నం, విశాఖపట్నం-రాజమండ్రి, విశాఖపట్నం-విజయవాడ, విజయవాడ-విశాఖపట్నం ఉదయ్ ఎక్స్‌ప్రెస్‌లను ఆగస్టు 14 నుంచి 20వ తేదీ వరకు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక విశాఖపట్నం-గుంటూరు సింహాద్రి ఎక్స్‌ప్రెస్, గుంటూరు-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌లను కూడా 21వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక ఆగస్టు 14,15వ తేదీల్లో ఎర్నాకులం-పట్నా ఎక్స్‌ప్రెస్‌ను, బెంగళూరు-గువాహటి ఎక్స్‌ప్రెస్‌ను 16,18వ తేదీలలో, కోయంబత్తూర్-సిల్చార్ ఎక్స్‌ప్రెస్‌ను ఆగస్టు 13,20న దారి మళ్లించనున్నారు. ఈ ట్రైన్లను సాధారణంగా వెళ్లే నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ మీదుగా కాకుండా నిడదవోలు, ఏలూరు, విజయవాడ మీదుగా దారి మళ్లించనున్నట్లు రైల్వే అధికారులు స్పష్టం చేశారు.
ఇక సికింద్రాబాద్ డివిజన్‌లో పనుల కారణంగా పలు రైళ్లు కూడా రద్దయ్యాయి. విజయవాడ-డొర్నకర్, సికింద్రాబాద్-డొర్నకర్ రైళ్లను రద్దు చేశారు. అటు తమిళనాడులో వెల్లంకి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్లను నడపనుంది . 8 ప్రత్యేక రైళ్లను ప్రకటించగా.. ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 8 వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి.