పెండింగ్ బిల్లుల విడుదలకు తాను కమీషన్ డిమాండ్ చేస్తున్నట్టు వచ్చిన ఆరోపణలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ స్పందించారు. కాంట్రాక్టర్ల నుంచి తాను కమిషన్ అడిగినట్టు రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని, లేకుంటే ఆరోపణలు చేసిన వ్యక్తులు రాజకీయ సన్యాసం తీసుకుంటారా? అని సవాల్ విసిరారు. పెండింగ్ బిల్లుల కోసం డీకే 10 నుంచి 15 శాతం కమీషన్ అడుగుతున్నారంటూ కర్ణాటక గవర్నర్‌కు కాంట్రాక్టర్ల సంఘం ఫిర్యాదు చేయడం.. దీనిపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, మాజీ మంత్రి ఆర్ అశోక్ చేసిన విమర్శలకు డిప్యూటీ సీఎం కౌంటర్ ఇచ్చారు.
గుత్తేదారుల నుంచి తాను కమీషన్ అడిగినట్లు రుజువు చేస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని, కమీషన్ ఆరోపణలు వాస్తవం కాకపోతే మాజీ సీఎం బసవరాజ బొమ్మై, మంత్రి ఆర్.అశోక్ రాజకీయాల నుంచి వైదొలుగుతారా? అని సవాల్ చేశారు. కాంట్రాక్టర్ల నుంచి కమీషన్‌కు డిమాండ్ చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారని, డీకే, సిద్ధరామయ్య, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఎవరు అడిగారో ఆరోపించిన వ్యక్తులు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తాను ఎవరి దగ్గరైనా కమీషన్ డిమాండ్ చేసినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతానని స్పష్టం చేశారు.
ఒకవేళ తనపై ఆరోపణలు చేసిన వ్యక్తులు రుజువు చేయకపోతే రాజకీయాల నుంచి వైదొలుగుతారా? అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆర్.అశోక్‌పై విరుచుకుపడ్డారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో నాకు బాగా తెలుసని, తనకంటూ వ్యక్తితత్వం ఉందన్నారు. లక్ష ఓట్ల తేడాతో ఓడిపోయిన వ్యక్తి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు బిల్లులను అశోక్ మంజూరు చేయలేదని నిలదీశారు. బీజేపీ ప్రభుత్వంలో కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేయకుండా ఎవరు అడ్డుకున్నారని, ఆ సమయంలో నిధులు లేవా? పనులు బాగా చేయలేదా? అనే వాటికి మాజీ సీఎం బొమ్మై, మాజీ మంత్రి ఆర్.అశోక్ మొదట సమాధానం ఇస్తే.. తాను మిగతా కాంట్రాక్టర్ల సమస్యలకు సమాధానం ఇస్తానని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత గుత్తేదారుల సంఘం అధ్యక్షుడు కెంపణ్ణ ఫిర్యాదు మేరకు పనులు జరిగాయా? లేక మధ్యలో నిలిపివేశారా? అనే అంశాలను పరిశీలించేందుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్ణయించారని తెలిపారు. కాబట్టి ఇప్పుడు విచారణ జరుగుతున్నందున రెండు నెలల్లో బిల్లులు చెల్లిస్తామని, అంత వరకూ వేచి ఉండలేరా? అని వ్యాఖ్యానించారు. దీనిపై లోకాయుక్త పరిశీలిస్తారని డీకే శివకుమార్ పేర్కొన్నారు.