శివాలయంలోకి ప్రవేశించిన భారీ నాగుపాము.. అక్కడ నంది విగ్రహంపైకి ఎక్కి కూర్చుంది. పడగవిప్పి తదేకంగా లోపలి ఉన్న శివలింగాన్ని చూస్తూ కొదిసేపు అలాగే ఉండిపోయింది ఆ సర్పం. దీంతో ఆలయంలోని అర్చకులు ఆ సర్పానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయం తెలిసిన జనం పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. తమను చల్లగా చూడాలని మొక్కుకున్నారు. ఇది దైవ మహిమని, సాక్షాత్తు ఆ పరమేశ్వరుడి ఆభరమైన నాగుపాము ఆలయానికి వచ్చిందని భావించారు. దీంతో ఆలయ ప్రాంగణం శివనామ స్మరణతో మారుమోగిపోయింది.
ఈ ఘటన తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా అంబూరు సమీప కీళ్‌మురుంగైలోని ప్రసిద్ధ బ్రహ్మపురీశ్వరుడి ఆలయంలోకి శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. ఆలయంలోకి సుమారు 5 అడుగుల పొడవున్న నాగుపాము ప్రవేశించింది. అనంతరం నంది విగ్రహంపై కూర్చొని పడగ విప్పి.. గర్భగుడిలోని శివలింగానికి ఎదురుగా కూర్చుంది. దీంతో అక్కడ పూజారులు ఆ పాముకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల నుంచి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆ సర్పానికి మొక్కుకున్నారు.
ఇక, ఆలయం విధిరాత మార్చే పుణ్యక్షేత్రంగా గుర్తింపు పొందింది. పురాణం ప్రకారం ఈ ఆలయాన్ని సృష్టికర్త బ్రహ్మ నిర్మించారు. బ్రహ్మదేవుడి అహాన్ని అణచివేయడానికి శివుడు ఆయన ఐదో తలను ఖండించడంతో తేజస్సును కోల్పోతాడు. దీంతో సృష్టి కళను కూడా కోల్పోయిన బ్రహ్మదేవుడు.. శాపవిముక్తి కోసం తిరుపత్తూరుకు వచ్చి 12 (ద్వాదశ) లింగాలను ప్రతిష్టించి వాటిని ప్రార్థించాడని చెబుతారు. అతని భక్తికి మెచ్చిన శివుడు పార్వతీ సమేతంగా ప్రత్యక్షమై... కోల్పోయిన తేజస్సును తిరిగి ప్రసాదించాడని అంటారు. అంతేకాదు, అందరి తలరాతలను రాయడానికి కారణమైన వ్యక్తి విధిని ఎలా మార్చాడో, అలాగే ఇక్కడ తనను పూజించిన వారందరి విధిని మంచిగా మార్చగల శక్తి బ్రహ్మకు ఉంటుందని శివుడు మరో వరం ఇచ్చాడని, అందుకే ఇక్క బ్రహ్మ పూజలందుకుంటారని అంటారు.