ఉత్తరాఖండ్‌లో కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం చెందారు. రుద్రప్రయాగ్ జిల్లాలో గురువారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకోగా.. శుక్రవారం ఉదయం శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీశారు. కేదార్‌నాథ్ యాత్రికుల కారుపై కొండచరియలు విరిగిపడటంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు రుద్రప్రయాగ్ పోలీసులు తెలిపారు. మృతుల్లో గుజరాత్‌కు చెందినవారు ముగ్గురు, ఒకరు హరియాణాకు చెందినవారు కాగా.. మరొకర్ని గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్పారు.
గత నెల రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలకు ఉత్తరాఖండ్‌లో పలుచోట్ల కొండచరియలు విరిగిపడి.. అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. వాగులు, నదులు పొంగి.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కేదార్‌నాథ్ యాత్ర మార్గంలో పలుచోట్ల రహదారులు ధ్వంసమయ్యాయి. మరోవైపు, ఆగస్టు 14 వరకూ ఉత్తరాండ్‌లోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ గురువారం హెచ్చరించింది. డెహ్రాడూన్, తెహ్రీ గర్వాల్, పౌరీ గర్వాల్ జిల్లాలకు రెడ్ అలర్ట్, నైనిటాల్, చంపావత్, ఉధమ్ సింగ్ నగర్ జిల్లాలకు శుక్రవారం ఎల్లో అలర్ట్ జారీచేసింది.
శని, ఆదివారాలు డెహ్రాడూన్, తెహ్రీ గర్వాల్, పౌరీ గర్వాల్ సహా ఆరు జిల్లాలకు రెడ్, మిగతా జిల్లాకు ఆరెంజ్ హెచ్చరికలు చేసిన ఐఎండీ.. అనవసరమైన ప్రయాణాలు మానుకోవాలని సూచించింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ ట్విట్టర్‌లో కీలక సూచనలు చేశారు. పర్యాటకులు, స్థానికులు అత్యవసరమైతే తప్ప బయటకు రావాలని తెలిపారు. ‘రాష్ట్రంలోని చాలా జిల్లాలకు ఐఎండీ రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.. పర్యాటకులు, ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలి’ అని ట్వీట్ చేశారు. గత నెల రోజులుగా కురిసిన వర్షాలకు ఉత్తరాఖండ్‌లో ఇప్పటి వరకూ వేర్వేరు ఘటనల్లో 58 మంది ప్రాణాలు కోల్పోగా.. 37 మంది గాయపడ్డారు. మరో 19 మంది కనిపించకుండా పోయారు. మొత్తం 1,167 ఇళ్లు కూలిపోగా.. వీటిలో 33 పూర్తిగా ధ్వంసమయ్యాయి. రహదారులు, వంతెనలతో పాటు వ్యవసాయ పొలాలు కూడా ధ్వంసమయ్యాయి.