ఆఫ్రికా దేశం నైజర్‌లో రెండు వారాలుగా హింసాకాండ కొనసాగుతోంది. దీంతో అక్కడ భారతీయుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో వీలైనంత వేగంగా ఆఫ్రికా దేశాన్ని వీడి వచ్చేయాలని కేంద్ర విదేశాంగ శాఖ తెలిపింది. ఆ దేశంలో 250 మందికిపైగా భారతీయులు ఉన్నట్టు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు. ఉగ్రవాదంపై పోరాటం సాగిస్తోన్న నైజర్.. అనూహ్యంగా సైనిక తిరుగుబాటుతో పరిస్థితి దారుణంగా ఉంది. ఈ నేపథ్యంలో ఐరాస ఆందోళన వ్యక్తం చేస్తోంది.
సైన్యం తిరుగుబాటుతో నైజర్‌లో నెలకున్న ఉద్రిక్త పరిస్థితులతో నేపథ్యంలో భారతీయులు వీలైనంత త్వరగా ఆ దేశాన్ని వీడాలని కేంద్రం సూచించింది. ప్రస్తుతం, నైజర్‌లో దాదాపు 250 మంది భారతీయులు నివసిస్తున్నారు. సైనిక తిరుగుబాటు విస్తృతమైన నిరసనలు, హింసకు దారితీసిందని అధికారిక గణాంకాలు సూచిస్తున్నాయి. సైనిక చర్యతో ఆ దేశంలో అస్థిర పరిస్థితులతో యూరోపియన్ దేశాలు తమ పౌరులను ఖాళీ చేయించాయి. నైజర్‌కు వెళ్లాలనుకునే వారు సాధారణ పరిస్థితులను నెలకునే వరకు తమ ప్రణాళికలను పునరాలోచించుకోవాలని విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచించింది.
నైజర్‌లో జరుగుతున్న పరిణామాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి తెలిపారు. ‘ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, భారతీయ పౌరులు వీలైనంత త్వరగా ఆ దేశం విడిచి వెళ్లాలని సూచించారు’ అని ఆయన శుక్రవారం చెప్పారు. గగనతలం మూసివేయడంతో భూ సరిహద్దు గుండా బయలుదేరేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.. నైజర్‌లోని భారతీయులందరూ భారతీయ ఎంబసీలో నమోదు చేసుకోవాలి’ మిస్టర్ బాగ్చీ పేర్కొన్నారు.
నైజర్ రాజధానిలోని భారత రాయబార కార్యాలయం అక్కడ నివసిస్తున్న భారతీయులతో టచ్‌లో ఉందని, దేశం విడిచి వెళ్లేందుకు సహాయం చేస్తుందన్నారు. ఏదైనా సహాయం కోసం ఎంబసీలో అత్యవసర నెంబరును (+227 9975 9975) కూడా షేర్ చేశారు. ‘భారతీయులు (అక్కడ) సురక్షితంగా ఉన్నారని మాకు సమాచారం వచ్చింది’ అని బాగ్చి అన్నారు.
పశ్చిమ ఆఫ్రికాలో ఇస్లామిక్ తీవ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడటంలో కీలకంగా వ్యవహరించిన నైజర్ అధ్యక్షుడు మొహమ్మద్ బజౌమ్‌ను నిర్బంధించి జనరల్ అబ్దురహ్మనే ట్చియాని జులై 26న అధికారాన్ని చేజిక్కించుకున్నారు. దీంతో ఆ దేశంలో హింస చెలరేగింది. శక్తివంతమైన ఆర్మీ జనరల్స్ మద్దతుతో ప్రెసిడెన్షియల్ గార్డ్ చీఫ్ జాతినుద్దేశించిన మాట్లాడుతూ.. ‘తనను తాను నేషనల్ కౌన్సిల్ ఫర్ ది సేఫ్‌గార్డ్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ ప్రెసిడెంట్’గా ప్రకటించుకున్నారు. ఈ చర్యలను ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్, ఆఫ్రికన్ యూనియన్ ఖండించాయి. పొరుగు దేశాలైన మాలి, గినియా, చాద్, బుర్కినాఫాసో తర్వాత మూడేళ్లలో తిరుగుబాటు ఎదుర్కొన్న ఆఫ్రికన్ దేశం నైజర్. 1960లో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ఇది నాలుగో తిరుగుబాటు కావడం గమనార్హం.