దేశంలో నిత్యావసరాల ధరలు ఒక్కొక్కటిగా పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నియంత్రణ చర్యలు ప్రారంభించింది. గత కొన్ని రోజులుగా సామాన్యులకు అందకుండా ఉన్న టమాటా ధరలు ఇప్పుడిప్పుడే దిగి వస్తున్నాయి. అయితే ఈ క్రమంలోనే ఉల్లిపాయల ధరలు రోజు రోజుకూ పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఉల్లి ధరలను అదుపు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఈ నేపథ్యంలో బఫర్ స్టాక్‌ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉల్లి ధరలు దిగి వచ్చి సామాన్యులకు అందుబాటులోకి వస్తాయని పేర్కొంది. మరోవైపు.. దేశవ్యాప్తంగా టమాటా ధరలు దిగిరావడం సామాన్యులకు కాస్త ఊరటగా మారింది.
ఉల్లిపాయల ధరలను నియంత్రించడానికి ఇదివరకు సేకరించిన బఫర్ స్టాక్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. 3 లక్షల మెట్రిక్ టన్నుల ఉల్లిపాయలను ఈ ఆర్థిక సంవత్సరానికిగానూ బఫర్ స్టాక్‌గా గోదాముల్లో కేంద్రం భద్రపరిచింది. అయితే వివిధ కారణాల వల్ల మార్కెట్లోకి సరఫరా తగ్గి.. ధరలు పెరిగిన సమయంలో ఆ బఫర్ స్టాక్‌ను కేంద్రం విడుదల చేస్తూ ఉంటుంది. దీంతో ఉల్లి ధరలు పెరగకుండా ఆపుతుంది. దేశంలోని పలు రాష్ట్రాల్లోని మార్కెట్లకు ఉల్లి నిల్వలను పంపించాలని నిర్ణయించినట్లు కేంద్ర ఆహార మంత్రిత్వ శాఖ.. శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాదిలోనే అత్యధిక ధరలు నమోదైన ప్రాంతాలకు ఉల్లిపాయలను సరఫరా చేయనున్నట్లు పేర్కొంది. ఈ - వేలం, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లలో రిటైల్ విక్రయ మార్గాల ద్వారా ఉల్లిపాయలను అందిస్తామని తెలిపింది.
వినియోగదారులకు అనువైన ధరలకు ఉల్లిపాయలను అందుబాటులో ఉంచాలనే లక్ష్యానికి అనుగుణంగా క్రమంగా పంపిణీ ప్రక్రియ కొనసాగుతుందని ఆహార మంత్రిత్వ శాఖ పేర్కొంది. దేశంలో ఉన్న రాష్ట్రాలు ప్రజా పంపిణీ కోసం అడిగితే.. తగ్గింపు ధరతో ఉల్లిపాయలను సరఫరా చేస్తామని కూడా స్పష్టం చేసింది. గతంలో ఉల్లి ధరలు అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో కేంద్రం బఫర్ ఏటా స్టాక్ సేకరణను పెంచుకుంటోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో లక్ష మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ మాత్రమే ఉండగా.. ప్రస్తుత 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఉల్లిపాయల బఫర్ స్టాక్.. మూడు లక్షల మెట్రిక్ టన్నులకు చేరిందని పేర్కొంది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో పండించిన రబీ ఉల్లి ఉత్పత్తి మార్కెట్లో 65 శాతం వాటా ఉంటుందని స్పష్టం చేసింది. దాంతో మళ్లీ ఖరీఫ్ సీజన్‌లో పండించే ఉల్లి అందుబాటులోకి వచ్చే వరకు వినియోగదారుల వీటి అవసరాలు తీరుతాయని పేర్కొంది.