పాకిస్థాన్‌లో ప్రస్తుత పదవీ కాలానికి ముందే ప్రధాని షెహబాజ్ షరీఫ్.. జాతీయ అసెంబ్లీని రద్దు చేశారు. ఆగస్టు 9 వ తేదీన షెహబాజ్ షరీఫ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాకిస్థాన్‌లో గడువుకు ముందే ఎన్నికలు జరగనున్నాయి. పాక్ జాతీయ అసెంబ్లీని రద్దు చేసిన 3 నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ రాజీనామాతో పాక్‌కు ఆపద్ధర్మ ప్రధాని ఎంపిక కోసం సుదీర్ఘంగా చర్చించారు. చివరికి బలూచిస్థాన్ సెనెటర్‌కు ఆపద్ధర్మ ప్రధాని బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రధాని షెహబాజ్ షరీఫ్, ప్రతిపక్ష నేత రజా రియాజ్.. ఖరారు చేశారు.
బలూచిస్థాన్ సెనెటర్ అన్వర్ ఉల్ హక్ కాకర్.. పాకిస్థాన్ ఆపద్ధర్మ ప్రధానిగా ఆదివారం బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రధాని, ప్రతిపక్ష నేత కలిసి అన్వర్ ఉల్ హక్ కాకర్ పేరును ఖరారు చేసి.. అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి పంపించారు. ఆ వెంటనే ఆపద్ధర్మ ప్రధానిగా కాకర్ నియామకాన్ని అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ కూడా ఆమోదించారు. దీనికి సంబంధించి పాక్ ప్రధాని కార్యాలయం శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ వ్యవహారంపై పాకిస్థాన్‌లో ప్రతిపక్ష నేత రియాజ్ స్పందించారు. ఆపద్ధర్మ ప్రధానిగా దేశంలోని చిన్న ప్రావిన్స్‌కు చెందిన నేత ఉండాలని తాము నిర్ణయించామని.. అందులో భాగంగానే బలూచిస్థాన్‌కు చెందిన కాకర్ పేరును తమ పార్టీ ప్రతిపాదించినట్లు తెలిపారు. తమ ప్రతిపాదనను ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా అంగీకరించారని తెలిపారు. మరోవైపు.. ఆపద్ధర్మ ప్రధానిగా ఎంపికైన కాకర్.. ఆగస్టు 13న ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పాక్ మీడియా పేర్కొంది.
బలూచిస్థాన్ అవామీ పార్టీకి చెందిన అన్వర్ ఉల్ హక్ కాకర్.. ఓ చిన్న ప్రావిన్స్ బలూచిస్థాన్‌కు చెందిన చిన్న రాజకీయ నేత. పాకిస్థాన్ దేశవ్యాప్తంగా పెద్దగా పరిచయం లేని వ్యక్తిని తాజాగా ఆపద్ధర్మ ప్రధానిగా నియమితులయ్యారు. కానీ తిరుగుబాట్లతో బలూచిస్థాన్ ప్రాంతం నిరంతరం వార్తల్లో నిలుస్తుంది. గతంలో బలూచిస్థాన్ ప్రభుత్వానికి అధికార ప్రతినిధిగా కూడా కాకర్ పనిచేశారు. 2018 లో జరిగిన ఎన్నికల్లో బలూచిస్థాన్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలుపొందారు. అనంతరం సెనెట్‌లో సభ్యుడిగా ప్రవేశం పొందారు. ఆ తర్వాత బలూచిస్థాన్ అవామీ పార్టీలో చేరారు. దీంతో ఆయనను ఆ పార్టీ సెనెట్‌లో పార్లమెంటరీ లీడర్‌గా నియమించింది. విదేశాల్లో ఉండే పాకిస్థానీల సంరక్షణ, మానవ వనరుల అభివృద్ధిపై ఏర్పాటైన సెనెట్ స్టాండింగ్ కమిటీకి గతంలో ఛైర్‌పర్సన్‌గా కాకర్ వ్యవహరించారు.
పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీని ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆగస్టు 9న రద్దు చేశారు. దీంతో 90 రోజుల్లోగా పాక్‌లో ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితులు చూస్తే ఆ దేశంలో ఎన్నికలు కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇటీవల నిర్వహించిన జనాభా లెక్కల ప్రకారం.. గత ఆరేళ్లలో పాకిస్థాన్ జనాభా 16 శాతం పెరిగింది. అంటే దాదాపు 20 కోట్ల నుంచి 24 కోట్లకు పెరిగింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా పాక్‌లో నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉంటుంది. అయితే నియోజకవర్గాల పునర్విభజనం తర్వాతే ఎన్నికలు జరపాలని పాక్ చట్టాలు చెబుతున్నాయి. అయితే ఈ నియోజకవర్గాల పునర్విభజన.. ప్రక్రియ పూర్తి చేయడానికి కనీసం నాలుగు నెలలైనా పడుతుందని పాక్ ఎన్నికల సంఘం చెబుతోంది. ఆ తర్వాతే ఎన్నికలు నిర్వహించాలంటే ఆలస్యం అయ్యే అవకాశాలే ఉన్నాయని తెలుస్తోంది.