తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యమైన గమనిక. ఆర్టీసీ ప్రయాణికుల సౌకర్యార్థం జారీచేసే రూ.300 టికెట్ల కోటాను టీటీడీ 1000కి పెంచిన సంగతి తెలిసిందే. 300 కిలోమీటర్లు దూరానికి పైబడిన నగరాల నుంచి తిరుపతికి వచ్చే ఆర్టీసీ బస్సులకు 80 శాతం టికెట్లు.. అంతకంటే తక్కువగా ఉంటే 20శాతం టికెట్లను కేటాయించింది. ఆన్‌లైన్‌లో ప్రయాణంతో పాటు శ్రీవారి రూ.300 టికెట్లను నెల రోజుల ముందుగానే రిజర్వేషన్ చేసుకోవచ్చని ఆర్టీసీ ఆపరేషన్స్ ఈడీ కోటేశ్వరరావు తెలిపారు. భక్తులు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని ఆర్టీసీ సూచించింది.
ఈ నెల 15 నుంచి అక్టోబరు 7 వరకు ప్రయాణం, దర్శనానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. అధికారిక వెబ్‌సైట్ www.apsrtconline.in లో అదనపు కోటా టికెట్ల బుకింగ్ చేసుకోవచ్చు. తిరుమల వెళ్లేందుకు ప్లాన్ చేసుకునే భక్తులు.. ఆర్టీసీ ద్వారా దర్శనం టికెట్లు బుక్ చేసుకోవాలని సూచించారు అధికారులు. బస్ టికెట్‌తో పాటూ ఈజీగా తిరుమల శ్రీవారి దర్శన టికెట్‌ను కూడా బుక్ చేసుకునే అవకాశం కల్పించింది.
మరోవైపు తిరుమల నడక దారిలో చిరుతల సంచారంతో టీటీడీ అప్రమత్తం అయ్యింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం కాలినడకన వచ్చే భక్తులకు ఎలాంటి అపాయం కలగకుండా వారి ప్రాణరక్షణే ధ్యేయంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. కాలినడక మార్గాలు, ఘాట్‌లలో యాత్రికుల భద్రత దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ ఈవో, ఎస్పీ, అటవీ శాఖ, జిల్లా జాయింట్ కలెక్టర్ ఇతర అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.
అలిపిరి, శ్రీవారిమెట్టు నడకమార్గాల్లో ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే 12 ఏళ్లలోపు చిన్నపిల్లలను వారి తల్లిదండ్రులతో సహా అనుమతిస్తామన్నారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. పెద్దవారిని రాత్రి 10 గంటల వరకు అనుమతిస్తామని.. నడకదారి భక్తులకు సహాయంగా ఉండేలా ప్రతి ఒక్కరికీ ఊతకర్ర ఇవ్వాలని నిర్ణయించామన్నారు. ఘాట్ రోడ్లలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే బైక్‌లను అనుమతిస్తామని తెలిపారు.
భక్తుల రక్షణకు గాను అటవీ శాఖ ఆధ్వర్యంలో నిపుణులైన అటవీ సిబ్బందిని నియమించుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. భక్తులను గుంపులుగా పంపుతామని, వీరికి సెక్యూరిటీ గార్డులు భద్రతగా ఉంటారని చెప్పారు. సాధు జంతువులకు ఆహారపదార్థాలు అందించడాన్ని, అలాచేసే వారిపైనా, ఆహార పదార్థాలు విక్రయించే వారిపైనా చర్యలు తీసుకుంటామని వివరించారు. నడకదారుల్లో ఉన్న హోటళ్ల నుండి వ్యర్ధాలు వదిలివేయకుండా తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
నడకదారుల్లో 500 కెమెరా ట్రాప్ లు ఏర్పాటు చేశామని, అవసరమైతే డ్రోన్లను కూడా వినియోగిస్తామని తెలిపారు. వైల్డ్ లైఫ్ అవుట్ పోస్టులు 24/7 ఏర్పాటు చేసి అనిమల్ ట్రాకర్స్, డాక్టర్లను అందుబాటులో ఉంచుతామన్నారు. రోడ్డుకిరువైపులా 30 అడుగుల దూరం కనిపించేలా ఫోకస్ లైట్లు ఏర్పాటు చేస్తామన్నారు. ఫెన్సింగ్ ఏర్పాటుకు అటవీ శాఖ కేంద్ర, రాష్ట్ర ఉన్నతాధికారులు అధ్యయనం చేసి నివేదిక సమర్పిస్తారని, అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. క్రూరమృగాలపై భక్తులకు అవగాహన కల్పించేందుకు అలిపిరి, గాలిగోపురం, ఏడో మైలు వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామన్నారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్, శ్రీవారి మెట్టు వద్ద రోజుకు 15 వేల దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామని, మధ్యలో వీటిని స్కానింగ్ చేసుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. దివ్య దర్శనం టోకెన్లు పొందిన భక్తులు రోడ్డు మార్గంలో కూడా తిరుమలకు వెళ్లవచ్చని చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa