సులభ్ ఇంటర్నేషనల్.. దేశంలో ఈ పేరు తెలియని పౌరుడు ఉండరు. ప్రజా జీవితంలో పెను మార్పునకు కారణమైన ఆలోచన ఇది. ఆ ఆలోచన వెనుక ఉన్న మానవతావాది, సామాజిక కార్యకర్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాథక్ ఇకలేరు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయస్సు 80 ఏళ్లు. దేశంలో బహిరంగ మల విసర్జనకు వ్యతిరేకంగా కృషి చేసిన యోధుడాయన. కోట్లాది మంది పేదలకు ఉచితంగా టాయిలెట్లు నిర్మించి ఇచ్చిన మానవతామూర్తి. వేలాది ఆవాసాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో విశేషమైన కృషి చేశారు. పరిశుభ్రతపై అలుపెరుగని పోరాటం చేసిన బిందేశ్వర్ పాథక్.. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (ఆగస్టు 15) సాయంత్రం తన చివరి శ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. పాథక్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం ఈ దేశానికి తీరని లోటన్నారు.
కొన్నేళ్ల కిందటి సంగతి. తెలియని ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తే.. మార్గమధ్యంలో ఒకటికో, రెండుకో వెళ్లాల్సి వస్తే, ఆ పరిస్థితి ఊహించుకోడానికే భయానకం. బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో మరుగుదొడ్లు ఉన్నా.. నిర్వహణ సరిగాలేక, వాటిల్లోకి వెళ్లాల్సి వస్తే వాంతి చేసుకోవాల్సిన పరిస్థితి. అలాంటి భయానక సమస్యకు ఒక చిన్న ఆలోచనతో పరిష్కారం చూపించారు బిందేశ్వర్ పాథక్. ప్రభుత్వ, పౌరుల భాగస్వామ్యంతో అద్భుతాలు చేయొచ్చని చూపించారు. ‘సులభ్ కాంప్లెక్స్’ల నిర్మాణంతో సామాన్యుల జీవితాల్లో పెను మార్పులు వచ్చాయని చెబితే అతిశయోక్తి కాదు. ఆ సమస్య తీవ్రత తెలిసిన వారికి ఆ విషయం తేలిగ్గానే అర్థమవుతుంది.
‘సులభ్ ఇంటర్నేషనల్’ పేరు చెబితే చాలా మందికి మరుగుదొడ్లు మాత్రమే గుర్తుకురావొచ్చు. కానీ, ఆ సంస్థ ద్వారా బిందేశ్వర్ పాథక్ చేసిన సేవా కార్యక్రమాలు అనేకం. భారత్‌లోనే కాదు, అనేక దేశాల్లో పేదల జీవితాల్లో వెలుగులు నింపారు పాథక్. సులభ్ ఇంటర్నేషనల్ ద్వారా 5.4 కోట్ల ప్రభుత్వ టాయిలెట్లను నిర్మించి ఇచ్చారు. పేదల కోసం మరో 13 లక్షల టాయిలెట్లు నిర్మించి ఇచ్చారు. వీటి కోసం అత్యంత చవకైన ‘టుపిట్’ సాంకేతికతను ఉపయోగించారు.
మనుషుల మలమూత్రాలను మనుషులతోనే శుభ్రం చేయించే విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు బిందేశ్వర్ పాథక్. దీన్ని రద్దు చేసేందుకు ఉద్యమాన్నే నడిపారు. 1970లో ‘సులభ్ ఇంటర్నేషనల్’ సంస్థను స్థాపించారు. మానవతా దృష్టికి సాంకేతికతను జోడించి పని చేయడమే ఈ సంస్థ ఉద్దేశం. పర్యావరణ పరిశుభ్రత, వ్యర్థాల నిర్వహణతో పాటు మానవ హక్కుల కోసం ఈ సంస్థ ద్వారా విశేష కృషి చేశారు పాథక్.
సఫాయీ కార్మికులకు ఎలాంటి రక్షణ తొడుగులు లేకుండా వారి చేతులతోనే మానవ వ్యర్థాలను తొలగించే పరిస్థితిని తీవ్రంగా ఖండించారు. ఇది వారిని కించపరిచే చర్యేనని పేర్కొన్నారు. పాథక్ పోరాటంతో ఈ సమాజంలో ఏళ్లుగా నాటుకుపోయిన విధానాలను రూపుమాపేందుకు ప్రభుత్వం అనేక చట్టాలు చేసింది.
మ్యాన్‌హోళ్లలోకి దిగి, మానవ వ్యర్థాలను శుభ్రంచేసే సఫాయీ కర్మచారీ కుటుంబాలతో కలిసి ఉండి, వారి కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు పాథక్. ఈ ఒక్క ఉదాహరణ చాలు.. పేదల జీవితాలను మెరుగుపర్చడం పట్ల ఆయన సంకల్పం, నిబద్ధత ఎంత గొప్పదో చెప్పడానికి. సఫాయీ కర్మచారీ జీవితాల్లో తీసుకువచ్చిన మార్పునకు, పర్యావరణ పరిశుభ్రత, సాంప్రదాయేతర ఇంధన వనరుల వాడకం లాంటి విషయాల్లో బిందేశ్వర్ పాథక్ చేసిన కృషికి గాను ఆయణ్ని ఎన్నో అవార్డులు వరించాయి. 1991లో కేంద్ర ప్రభుత్వం ఆయణ్ని ‘పద్మ భూషణ్’ అవార్డుతో సత్కరించింది.
బీహార్‌లోని హాజీపుర్‌లో 1943లో బిందేశ్వర్ పాథక్ జన్మించారు. ఇండియన్ రైల్వేకు చెందిన స్వచ్ఛ రైల్ మిషన్ బ్రాండ్ అంబాసిడర్‌గానూ ఆయన పని చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున భాగల్‌పుర్ నుంచి పోటీ చేసి గెలిచారు. పరిశుభ్రత, తదితర అంశాలపై అనేక పుస్తకాలను రాశారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా కోట్లాది మంది జీవితాలను ప్రభావితం చేసిన పాథక్ మృతి పట్ల సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa