ఏ పుట్టలో ఏ పాముందో తెలియదు అంటారు కానీ ఎక్కడ ఏ పాము నక్కికూర్చుందో చెప్పడం కూడా కష్టమే. అమెరికా.. లోవాలోని ఓ షాపింగ్ కార్ట్‌లో 6 అడుగుల పాము కనిపించడంతో స్టోర్‌లో ఉన్నవారు భయాందోళనకు గురయ్యారు. అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఎరుపురంగు తోక కలిగిన ఈ పామును సురక్షితంగా తీసుకువెళ్లారు. అయితే బోవా కాన్‌స్ట్రిక్టర్ అనే ఈ పాము ఈ స్టోర్‌లోకి ఎలా వచ్చిందనేది వారికి పెద్ద పజిల్‌గా మారిందట.
న్యూస్‌వీక్ ప్రకారం, ఈ సంఘటన శనివారం ఉదయం అయోవాలోని సియోక్స్ సిటీలోని టార్గెట్ ప్రదేశంలో జరిగింది. స్టోర్‌లోని వీల్ బాస్కెట్‌లో పాము కనిపించడంతో ఉదయం పదకొండున్నర గంటల సమయానికి ఎనిమిల్ కంట్రోల్ అధికారులకు సమాచారం అందించారు. ఈ పామును గుర్తు తెలియని కస్టమర్ ఎవరైనా తెలియకుండా లోనికి తీసుకు వచ్చి ఉంటారని భావిస్తున్నారు.
బోవా కాన్‌స్ట్రిక్టర్‌ను ఉంచిన సియోక్స్ సిటీ యానిమల్ అడాప్షన్ అండ్ రెస్క్యూ సెంటర్‌కు చెందిన ఒక ఉద్యోగి మాట్లాడుతూ... పాము దొరికిన టార్గెట్ పార్కింగ్ నుండి సెక్యూరిటీ ఫుటేజీని పరిశీలించినట్లు చెప్పారు. అయితే, పాము అసలు ఎవరికి చెందినది? అది షాపింగ్ కార్ట్‌లో ఎలా చేరింది? అనేది తెలియరాలేదని చెబుతున్నారు.
విస్కాన్సిన్‌లోని రేసిన్ జూ అందించిన సమాచారం ప్రకారం, మగ కొలంబియన్ రెడ్-టెయిల్డ్ బోయా కాన్‌స్ట్రిక్టర్ సాధారణంగా 6 నుండి 8 అడుగుల పొడవు ఉంటుంది. ఆడ పాములు అయితే 7 నుండి 9 అడుగులు ఉంటాయి. పెద్దగా ఉండే ఆడ పాములు 30 పౌండ్ల వరకు బరువు ఉంటాయి.