‘మేమొస్తే ఇక విద్యుత్ చార్జీలు పెంచబోం. వీలైతే ఇంకా తగ్గిస్తాం’ అని టీడీపీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. కొత్తగా రూపు దిద్దుకుంటున్న హైడ్రోజన్ హరిత ఇంధనం తయారీకి రాష్ట్రాన్ని హబ్‌గా మారుస్తామని కూడా తెలిపారు. రాజధాని అమరావతి ప్రస్తుత పరిస్థితిపై ఆవేదన వ్యక్తంచేశారు. విజయవాడ, గుంటూరులతో పాటు అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని పనులు చేపట్టామని.. అయితే దుర్మార్గుడు చేసిన పనికి అమరావతి బలైపోయిందని ఆక్రోశించారు. విశాఖ ప్రజలు కూడా అమరావతినే రాజధానిగా కోరుకుంటున్నారని, అది వారి మంచితనమన్నారు. పోలవరాన్ని 72 శాతం పూర్తిచేసి అప్పగిస్తే.. రివర్స్ టెండరింగ్ ద్వారా జగన్ దానిని గోదావరిలో ముంచేశారని ధ్వజమెత్తారు. నదుల అనుసంధానం కోసం కేంద్రం 30 ప్రాజెక్టులు చేపడితే.. ఆంధ్రప్రదేశ్‌లో తాము మాత్రమే రికార్డు సమయంలో గోదావరి-కృష్ణా అనుసంధాన ప్రాజెక్టు అయిన పట్టిసీమను పూర్తి చేయగలిగామని చెప్పారు. మళ్లీ అధికారంలోకి వస్తే వంశధార, నాగావళి, గోదావరి, కృష్ణా, పెన్నా నదులను అనుసంధానం చేస్తామన్నారు.