నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని నెర్ధనంపాడులో కన్నతండ్రినే రోడ్డున పడేసిన ఘటన వెలుగుచూసింది. ఇర్ల పెద్ద అంకయ్య (77)కు ఇద్దరు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. కూలీనాలి చేసి వారందరినీ పెంచి పోషించి పెళ్లిళ్లు చేశారు. కుమార్తెలు అత్తారింటికి వెళ్లిపోగా, పెద్ద కుమారుడు పెద్దశీనయ్య ఆత్మకూరులోనూ, చిన్న కుమారుడు చిన్నశీనయ్య వింజుమూరు మండలంలో స్థిరపడ్డారు. పెద్ద అంకయ్య రెండేళ్లపాటు పెద్ద కుమార్తె వద్ద ఉన్నారు. ఆ తర్వాత గ్రామంలో పెద్ద మనుషులు పంచాయితీ చేసి ఒక్కో కుమారుడి వద్ద నెల రోజులు ఉండేలా కొడుకులను ఒప్పించారు. ప్రస్తుతం రెండు నెలలు ముగిసి మూడో నెల పడిన వెంటనే వారం క్రితం కొడుకులు ఆ వృద్ధ తండ్రిని తీసుకొచ్చి స్వగ్రామంలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న బస్సు షెల్టరులో వదిలి వెళ్లిపోయారు. లేచి నడవలేక అవస్థలు పడుతున్న వృద్ధుడిని గమనించిన పెద్దమనుషులు కుమారులకు ఫోన్ చేసి ప్రశ్నించారు. ఇంటి స్థలం, రూ.పది లక్షల విలువ జేసే రెండున్నర ఎకరాల పొలాన్ని పంచనని తండ్రి చెప్పడంతో ఆయన్ను రోడ్డుకీడ్చారని బంధువులు తెలిపారు. ప్రస్తుతం బస్ షెల్డరే పెద వెంకయ్యకు దిక్కయింది. ఆ వృద్ధుడిని చూసి గ్రామస్థుల హృదయాలు చలించిపోతున్నాయి. ఎవరైనా స్పందించి ఆయన్ను వీధికీడ్చిన అతడి కొడుకులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, పెదఅంకయ్యను అనాథాశ్రమంలో చేర్పించాలని బంధువులు కోరుతున్నారు.