తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బ్రాహ్మణిది పెద్దలు కుదిర్చిన వివాహమని ఇప్పటిదాకా అందరికీ తెలుసు. వరుసకు బావా, మరదళ్లైన వీరిద్దరికీ పెళ్లి జరిపించాలని నారా చంద్రబాబు నాయుడు కుటుంబం, నందమూరి బాలకృష్ణ కుటుంబం చర్చించి నిర్ణయం తీసుకున్నారు. అయితే, పెళ్లికి ముందు నుంచే బ్రాహ్మణిపై తనకు ప్రేమ ఉందని లోకేష్ తెలిపారు. తనది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పారు. ‘హలో లోకేష్’ కార్యక్రమంలో ఓ విద్యార్థిని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తన ప్రేమ, పెళ్లి బంధానికి సంబంధించి ఆసక్తికర వివరాలు తెలిపారు లోకేష్.
ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాలను చుట్టేస్తూ ‘యువగళం’ పేరుతో నారా లోకేష్ చేపట్టిన యాత్ర గుంటూరు జిల్లా మంగళగిరికి చేరుకుంది. గత ఎన్నికల్లో లోకేష్ ఈ స్థానం నుంచే పోటీ చేసి ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈసారి కూడా మంగళగిరి నుంచే పోటీ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లా యువతతో బుధవారం (ఆగస్టు 16) ‘హలో లోకేష్’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు.
ఈ కార్యక్రమానికి ఉమ్మడి గుంటూరుతో పాటు విజయవాడ నుంచి పెద్ద ఎత్తున విద్యార్థినీ విద్యార్థులు, యువత తరలివచ్చారు. కొంత మంది విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు లోకేష్ సమాధానాలు చెప్పారు. తిరువూరు శ్రీవాహిని కాలేజీ నుంచి వచ్చిన రమ్య అనే విద్యార్థిని నారా లోకేష్ వివాహం గురించి ప్రశ్న వేసింది. ‘బ్రాహ్మణి గారితో పెళ్లి ప్రతిపాదన మొదట ఎవరు తీసుకొచ్చారు? ఆ ప్రస్తావన రాగానే మీ మనసులో ఉన్న రియాక్షన్ ఏంటి?’ అని ఆమె అడిగింది.
‘నాది, బ్రాహ్మణిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అమ్మా. కానీ, ముద్దుల మామయ్య దగ్గర అంత సాహసం చేసేవాడిని కాదులే’ అంటూ నారా లోకేష్ చెప్పడంతో సభలో నవ్వులు విరిశాయి. ‘అమ్మా, నాన్న గారితో ఒకసారి వెకేషన్‌కి వెళ్లినప్పుడు.. వాళ్లు నాకు ఈ విషయం గురించి చెప్పారు. ఇట్లా అనుకుంటున్నాం.. నీ అభిప్రాయం ఏంటి అని అడిగారు. ఇక మన అభిప్రాయం ఏంటో తెలుసు కదా. వాళ్లు ప్రతిపాదించారు. ఎస్ అని అనుకున్నాం. బ్రాహ్మణి కూడా ఒప్పుకుంది. రెస్ట్ ఈస్ హిస్టరీ’ అంటూ లోకేష్ చెప్పుకొచ్చారు.
అప్పటిదాకా సీరియస్‌గా కొనసాగుతున్న కార్యక్రమం పెళ్లి ప్రస్తావనతో ఆసక్తికరంగా మారింది. బ్రాహ్మణి గురించి చెబుతూ.. లోకేష్ బిడియంతో ఒకింత మెలికిలు తిరిగిపోయారు. ‘గంభీరంగా సాగుతున్న కార్యక్రమాన్ని నీ ప్రశ్నతో ఆహ్లాదంగా మార్చేశావమ్మా..’ అంటూ ఈ కార్యక్రమానికి హోస్ట్‌గా వ్యవహరించిన టీడీపీ కార్యకర్త రాజేష్ అన్నారు. విద్యార్థిని రమ్యకు లోకేష్ కూడా థ్యాంక్స్ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో విద్య, వ్యవసాయం, ఐటీ రంగాల గురించి విద్యార్థులు ప్రధానంగా ప్రశ్నలు వేశారు. ఎక్కువ మంది ఉద్యోగాల గురించి ప్రశ్నించారు. బీటెక్, ఎంటెక్‌లు చదువుతున్నా.. చదువు పూర్తయ్యాక ఎక్కడికి వెళ్లాలనే భయం వేధిస్తోందని ఓ యువతి చెప్పింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రంగాల్లో ఎలాంటి సంస్కరణలు తీసుకురానున్నారో వివరించారు. ‘భయం నా బ్లడ్‌లోనే లేదు’ అంటూ తన ముద్దుల మామయ్య డైలాగ్‌తో అకట్టున్నారు లోకేష్.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa