సాధారణంగా కిలో రూ.50 పలికే టమాటా.. ఇటీవల ఏ స్థాయి ప్రతాపం చూపిందో మనమంతా చూశాం. ఏకంగా డబుల్ సెంచరీ దాటి ట్రిపుల్ సెంచరీ వైపు దూసుకెళ్లింది. దీంతో చాలా మంది టమాటాలను వినియోగించడం తగ్గించేశారు. మరికొందరైతే టమాటాలను వాడటమే మానేశారు. వీటికి తోడు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో ఇప్పుడిప్పుడే టమాటా ధరలు సామాన్యులకు అందుబాటు ధరల్లోకి వస్తున్నాయి. ఈ సంతోషం రావడం ఆలస్యం.. మరో షాకింగ్ న్యూస్ సామాన్యులను భయపెడుతోంది. ఎందుకంటే ఇటీవల అరటి పండ్ల ధరలకు రెక్కలు వచ్చాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం అరటి పండ్లు కేజీ సెంచరీ దాటేశాయి. డిమాండ్‌కు తగిన సరఫరా లేకపోవడంతోనే అరటి పండ్ల ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారస్తులు చెబుతున్నారు.
తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో కిలో అరటి పండ్ల ధర రూ.100 దాటింది. దీంతో అరటి పండ్ల ధరలు చూసి కొనుగోలుదారులు అవాక్కవుతున్నారు. అయితే రైతుల నుంచి తగినంత అరటి పండ్ల సరఫరా లేకపోవడంతోనే వీటికి డిమాండ్ ఏర్పడి ధరలు పెరుగుతున్నాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. బెంగళూరు నగరంలో అమ్మే అరటి పండ్లలో చాలా శాతం తమిళనాడు నుంచి సరఫరా అవుతాయి. ఎలక్కిబలే, పచ్‌బలే రకం అరటి పండ్లను బెంగళూరు నగర వాసులు ఎంతో ఇష్టంతో కొనుగోలు చేస్తుంటారు. అయితే ప్రస్తుతం తమిళనాడు నుంచి ఈ రకం పండ్ల సరఫరా తగ్గిపోవడంతో అసలు సమస్య మొదలైంది.
నెల రోజుల క్రితం బెంగళూరులోని బిన్నీపేట్ మార్కెట్‌కు రోజుకు 1500 క్వింటాళ్ల ఎలక్కిబలే సరకు వస్తే.. ప్రస్తుతం అది వెయ్యి క్వింటాళ్లకు పడిపోయిందని బిన్నీపేట్ మార్కెట్ అధికార వర్గాలు చెబుతున్నాయి. బెంగళూరుకు వచ్చే అరటి పండ్లు అక్కడి నుంచి తుమకూరు, రామనగర, చిక్‌బళ్లాపూర్, అనేకల్, బెంగళూరు రూరల్‌కు పంపిణీ అవుతుందని వెల్లడించారు. తమిళనాడులోని హోసూరు, కృష్ణగిరి నుంచి కర్ణాటకకు ఎక్కువగా అరటి పండ్లు రవాణా అవుతాయని మార్కెట్ అధికారులు చెబుతున్నారు.
సరఫరా తగ్గిపోవడంతో హోల్‌సేల్‌లోనే కిలో ఎలక్కిబలే రకం అరటి పండ్ల ధర రూ.78 కు చేరుకుందని.. అదే విధంగా పచ్‌బలే రకం రూ.18 నుంచి రూ. 20 వరకు పలుకుతోందని పేర్కొన్నారు. అయితే అన్ని ఖర్చులు కలుపుకుని.. మార్కెట్లోని వ్యాపారులు కిలో ఎలక్కిబలే రకం అరటిపండ్లను రూ.100 చొప్పున విక్రయిస్తున్నారని తెలిపారు. అటు.. పచ్‌బలే రకం అరటి పండ్లను కిలో రూ.40 చొప్పున అమ్ముతున్నారని పేర్కొన్నారు. అయితే మరికొన్ని రోజుల్లో పండగలు రానున్న నేపథ్యంలో అరటి పండ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఓనం, వినాయక చవితి, విజయ దశమి పండగలకు అరటి పండ్ల ఆకాశాన్నంటుతాయని అభిప్రాయపడుతున్నారు.