సీఎం జగన్ పక్కా వ్యాపారి అని, తన లాభం కోసం ఎంతకైనా తెగిస్తాడని పవన్‌కల్యాణ్ ఆరోపించారు. అందుకే ఆయన పాలనలో నేరాల సంఖ్య పెరిగిపోయిందన్నారు. భూ దోపిడీ కోసం బెదిరించడం, చంపడం, కేసులు పెట్టడం వంటివి గతంకంటే ఎక్కువగా ఉన్నాయన్నారు. విశాఖలో ఒక్క బార్ వద్దే రెండు నెలల్లో మూడు హత్యలు జరిగాయని, ఈ ప్రభుత్వం ప్రతిదీ తేలిగ్గా తీసుకుంటోందని ఆరోపించారు. జగన్ నివాసం ఉండే తాడేపల్లి పరిసరాల్లోను ఇటీవల నేరాల సంఖ్య పెరిగిందన్నారు. ఏపీలో 30 వేల మంది మహిళలు అదృశ్యమైపోయారని తాను చెబితే మంత్రులతో తిట్టించారని, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి పార్లమెంటులో ఆ విషయం నిజమేనని చెప్పినా ఇప్పటివరకు దానిపై కనీసం సమీక్ష కూడా చేయలేదని దుయ్యబట్టారు. చిత్తూరు ఎస్పీ కూడా తనను తప్పుబట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. గతంలో బిహార్‌లో నేరాలు ఎక్కువని చెప్పేవారని, ఇప్పుడు ఏపీని చూపిస్తున్నారని అన్నారు.