కృష్ణా జిల్లా,తాడిగడప డొంకరోడ్డులో మోడ్రన్ చికెన్ షాపు వద్ద జరిగిన ముస్లిం యువకుడు షేక్ రఫీ (33) హత్య కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రఫీపై మొత్తం 15 మంది మూకుమ్మడిగా దాడి చేసినట్టు పోలీసు నిర్ధారించారు. వారిలో ఐదుగురు యువకులు ముఖ్యపాత్ర పోషించినట్టు సమాచారం. ఇప్పటి వరకు ఎల్లారెడ్డి, అనిల్, డాన్ బాషాల పేర్లు వెలుగులోకి వచ్చాయి. వారితో పాటు నవీన్, సాంబశివరావు అనే మరో ఇద్దరు రఫీపై దాడి చేశారని తెలుస్తోంది. నిందితుల్లో 13 మందిని పెనమలూరు పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసినట్టు సమాచారం. కీలకమైన నిందితుల్లో మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిసింది. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల్లో నవీన్‌పై పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లో రౌడీషీట్ ఉంది.