ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టీటీడీకి బెదిరింపు కాల్,,,తమిళనాడుకి చెందిన వ్యక్తి అరెస్ట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 19, 2023, 06:14 PM

స్వాతంత్య్ర దినోత్సవం రోజున టీటీడీకి బాంబు బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడిపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపడుతున్నారు. బెదిరింపు కాల్ చేసిన వ్యక్తిని తమిళనాడులోని సేలం జిల్లాకు చేందిన బాలాజీ(39)గా గుర్తించారు. బాలాజీ ఆగస్టు 15న అలిపిరి చెక్ పాయింట్‌కి సంబంధించిన ల్యాండ్ ఫోన్ నెంబర్‌ను టీటీడీ కంట్రోల్ రూమ్ నుండి సేకరించాడు. ఆ తర్వాత ఉదయం 11:25 గంటల ప్రాంతంలో అలిపిరి చెక్ పాయింట్ ఆఫీస్ ల్యాండ్ ఫోన్ నెంబర్‌కు తన ఫోన్ చేసి కాల్ చేసి బాంబు పెట్టినట్లు బెదిరింపులకు గురి చేశాడు.


ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు బాంబ్ పేలుతుందని, ఇందులో 100 మంది వరకు చనిపోతారని బెదిరించాడు. దీంతో టీటీడీ విజిలెన్స్,‌ పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు. అలిపిరి చెక్ పాయింట్ వద్ద వాహనాలతో పాటు అలిపిరి నడక‌మార్గంలో తనిఖీలు చేపట్టారు. అలాగే చుట్టుపక్కల అనేక ప్రాంతాలను పరిశీలించారు. కానీ ఎక్కడా బాంబ్ పెట్టినట్లు నిర్ధారణ కాకపోవడంతో ఫేక్ కాల్ చేసినట్లు గుర్తించారు. దీంతో నిందితుడు ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులకు టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు.


ఈ నెల 16న తిరుమల టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఫోన్ నెంబర్‌ ఆధారంగా ట్రేస్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బెదిరింపు కాల్ చేసిన బాలాజీని శనివారం అరెస్టు చేసి విచారణ చేపడుతున్నారు. అయితే బెదిరింపు కాల్ చేసిన వ్యక్తి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని, మతిస్థిమితం కోల్పోయినట్లు పోలీసులు గుర్తించారు. గత పది ఏళ్లుగా కుటుంబ కలహాలతో అతడు బాధపడుతున్నాడు. అలాగే చదువుకు తగ్గ సరైన ఉద్యోగం దొరక్కపోవడంతో మతిస్థిమితం కోల్పోయి సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు తమిళనాడులోని రత్నాకర్ బ్యాంక్‌లో శాలరీ రిలేషన్షిప్ మేనేజర్‌గా పని చేస్తున్నట్లు తేలింది.


అయితే ఇటీవల నెల్లూరు జిల్లాకు చెందిన లక్షితపై తిరుమలలో చిరుత దాడి చేసి చంపేసిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న బాలాజీ.. అధికారులు అప్రమత్తంగా ఉన్నారా? లేదా? అనేది తెలుసుకునేందుకు ఇలా చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇలాంటి బెదిరింపు కాల్స్ చేసేవారికి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలాంటి కాల్స్ చేస్తే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com