ఏపీలో వాహనదారులకు అలర్ట్.. ఇకపై రవాణా శాఖ జారీ చేసే డ్రైవింగ్ లైసెన్సులు, ఆర్‌సీలు కార్డు రూపంలో ఉండవు. సంబంధిత యాప్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న డాక్యుమెంట్లు సరిపోతాయి.. ఈ మేరకు రవాణాశాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. లైసెన్సులు, ఆర్సీలకు ఇప్పటి వరకు కార్డుకు రూ.200, పోస్టల్ సర్వీస్‌కు రూ.25 మొత్తం రూ.225 చలానాతో కలిపి వసూలు చేసేవారు. ఇప్పుడు ఆ ఛార్జీలను వసూలు చేయడం లేదు.
ఇప్పటికే డబ్బులు చెల్లించిన వారికి మాత్రం త్వరలో కార్డులను అందజేయనున్నారు. రవాణా శాఖకు సంబంధించి కేంద్రం ‘వాహన్ పరివార్’తో సేవలన్నీ ఆన్‌లైన్ చేయడంతో చాలా రాష్ట్రాల్లో కార్డులను తొలగించి, డిజిటల్ రూపంలోనే పత్రాలు తీసుకొచ్చారు. ఇప్పుడు ఏపీలో కూడా దీన్ని అమల్లోకి తెచ్చారు. వాహనదారులు రవాణాశాఖ వెబ్‌సైట్ https://aprtacitizen.epragathi.org/ ఫారం 6 లేదా 23ని డౌన్‌లోడ్ చేసుకొని డాక్యుమెంట్‌ను తీసుకోవాల్సి ఉంటుంది.
మొబైల్‌లో ఏపీఆర్టీఏ సిటిజన్ యాప్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ లు లేనివారు మాత్రం పేపర్ పై ప్రింట్ తీసుకుని జేబులో పెట్టుకోవాల్సి ఉంటుంది. పోలీసులు, రవాణాశాఖ అధికారులు వాహనాల్ని తనిఖీలు చేసే ఇలా డౌన్‌లోడ్ చేసిన పత్రాలను చూపిస్తే సరిపోతుంది. వీటిని అనుమతించాలని తనిఖీలు చేసే పోలీసు, రవాణా తదితర శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఇకపై వాహనదారులు ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సుల్ని కార్డుల రూపంలో చూపించాల్సిన పనిలేదు. తనిఖీల్లో భాగంగా ఎవరైనా లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ కార్డు అడిగితే స్మార్ట్ ఫోన్ లో డౌన్ లోడ్ చేసుకున్న డాక్యుమెంట్ చూపిస్తే సరిపోతుంది.