ఈ నెల 28న చిత్తూరు జిల్లా నగరి పర్యటనకు సీఎం జగన్ రానున్నారు. జగనన్న విద్యాదీవెన నిధులను కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నగరి పర్యటనకు సంబంధించి బహిరంగ సభ, హెలిప్యాడ్స్, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను రాష్ట్ర అటవీ, విద్యుత్, పర్యావరణ, భూగర్భ ,గనుల శాఖ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పర్యాటకశాఖ మంత్రి రోజా పరిశీలించారు. నగరి పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు.
సీఎం జగన్ నగరి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రోజా తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసి ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎటువంటి పొరబాట్లకు తావులేకుండా సభను విజయవంతం చేయాలని తెలిపారు. బహిరంగ సభకు సంబంధించిన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు పెద్దిరెడ్డి, రోజా సూచించారు. ప్రధాన రహదారి నుంచి సభా స్థలానికి వచ్చే రోడ్డు, రోడ్ షో ఏ మార్గంలో రావాలనే దానిపై అధికారులకు పలు సూచనలు చేశారు.
అయితే ప్రతి ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభంలో జగనన్న విద్యాదీవెన డబ్బులను ప్రభుత్వం ఇస్తోంది. డిగ్రీ, మెడిసిన్, ఇంజినీరింగ్ చదువుకునే విద్యార్థులకు రూ.20 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు అందిస్తోంది. ఈ డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుంది. ఈ ఏడాదికి సంబంధించిన నగదును నగరిలో జరిగే బహిరంగ సభలో జగన్ విడుదల చేయనున్నారు. మంత్రి రోజా సొంత నియోజకవర్గంలో సభ జరుగుతుండటంతో దీనిపై ఆసక్తి నెలకొంది.