సూపర్‌స్టార్ రజినీకాంత్. ఈ పేరు చెప్తేనే మన దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా దేశాల్లో విపరీతమైన క్రేజ్. ఇక తమిళనాడులో అయితే ప్రాణాలు ఇచ్చే అభిమానులు ఉన్నారు. తలైవా సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు.. విదేశాల నుంచి తమిళనాడుకు వచ్చి సినిమాలు చూసేవారు చాలామంది ఉన్నారు. ఈ క్రమంలోనే రజినీకాంత్ ఇటీవల నటించిన జైలర్ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. అయితే ఈ క్రమంలోనే వివిధ ఉత్తర భారత రాష్ట్రాల్లో తలైవా పర్యటించారు. ఈ క్రమంలోనే ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఇంటికి.. వెళ్లిన రజినీకాంత్ ఆయన పాదాలకు నమస్కరించారు. ఇప్పుడు ఇదే తీవ్ర చర్చకు దారితీసింది. వయసులో చిన్నవాడైన సీఎం కాళ్లు రజినీకాంత్ మొక్కడం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.
రజినీకాంత్ వయసు 72 ఏళ్లు కాగా.. యోగి ఆదిత్యనాథ్ వయసు 51 ఏళ్లు మాత్రమే. అయితే తనకంటే 21 ఏళ్లు తక్కువ వయసు ఉన్న యోగి కాళ్లకు తలైవా నమస్కరించడంపై తీవ్ర విమర్శ, చర్చకు తెరలేపింది. ఈ ఘటనపై తలైవా ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా సమాధానాలు ఇస్తున్నారు. అయితే యోగి ఆదిత్యనాథ్ సన్యాసి అని.. అందుకే ఆయన కాళ్లకు రజినీకాంత్ దండం పెట్టారని చెబుతున్నారు. కేవలం బీజేపీ నేత అనో లేక ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనో యోగి ఆదిత్యనాథ్ కాళ్లకు రజినీకాంత్ మొక్కలేదని పేర్కొంటున్నారు. యోగి గతంలో గోరక్‌పూర్ పీఠాధిపతి పదవిలో ఉండేవారు. అదే భక్తి భావనతో యోగి పాదాలకు రజనీకాంత్ నమస్కరించారని భావిస్తున్నారు.
అయితే సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి జైలర్ సినిమా చూడాలని నిర్ణయించుకున్నారు. అయితే అత్యవసర పనుల కారణంగా యోగి ఆదిత్యనాథ్ రాకపోవడంతో యూపీ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్యతో కలిసి రజినీకాంత్ జైలర్ చిత్రాన్ని చూశారు. ఆ తర్వాత లక్నోలోని యోగి ఆదిత్యనాథ్ నివాసానికి శనివారం సాయంత్రం రజినీకాంత్ వెళ్లి కలిశారు. ఇంటి బయటికి వచ్చిన యోగి ఆదిత్యనాథ్.. రజినీకాంత్‌కు సాదర స్వాగతం పలికారు. ఆ సమయంలోనే యోగి కాళ్లకు రజినీకాంత్ నమస్కరించారు. జైలర్ సినిమా రిలీజ్ తర్వాత ఆధ్యాత్మిక మూడ్‌లోకి వెళ్లిన తలైవా.. జార్ఖండ్ రాంచీలో ఉన్న తన గురువు పరమహంస యోగానంద ఆశ్రమానికి వెళ్లి అక్కడ గంటపాటు ధ్యానం చేశారు. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. మరోవైపు.. నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్టర్‌గా రజనీకాంత్ నటించిన జైలర్ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం 10 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 500 కోట్ల వసూళ్లు రాబట్టింది. రజనీకాంత్ కెరీర్‌లో రోబో 2.0 తర్వాత రూ.500 కోట్ల బడ్జెట్ తెచ్చిన మూవీగా జైలర్ నిలిచింది. సినిమా విడుదలైన రెండో వారం కూడా పలు రాష్ట్రాల్లోని థియేటర్ల ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.