ప్రముఖ భారతీయ అమెరికన్ గణిత శాస్త్రవేత్త డాక్టర్ సీఆర్ రావు (102) కన్నుమూశారు. ప్రపంచ ప్రఖ్యాత సంఖ్యా శాస్త్రవేత్తగా గుర్తింపు పొందిన సీఆర్ రావు అసలు పేరు కల్యంపుడి రాధాకృష్ణ రావు. స్టాటిస్టిక్స్‌లో నోబెల్ బహుమతిగా భావించే ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇన్ స్టాటిస్టిక్స్‌కు ఎంపికయ్యారు. ఈ ఏడాదే ఈ బహుమతి ఆయన ఎంపిక కావడం గమనార్హం. 1945లో కోల్‌కతా మేథమేటికల్ సొసైటీలో ప్రచురితమైన పరిశోధన పత్రానికి ఈ అవార్డు దక్కింది. ఆధునిక గణిత శాస్త్రంలో సీఆర్ రావును ప్రావీణ్యుడిగా చెబుతారు. మల్టీవేరియేట్ విశ్లేషణ, శాంపిల్ సర్వే థియరీ, బయోమెట్రి లాంటి అంశాలపై పనిచేశారు.
కర్ణాటకలోని బళ్లారి జిల్లా హడగలిలో ఓ తెలుగు కుటుంబంలో 1920 సెప్టెంబరు 10న సీఆర్ రావు జన్మించారు ఆయన బాల్యం ఏపీలో గూడురు, నూజివీడు, నందిగామ, విశాఖ జిల్లాల్లో గడిచింది. ఆంధ్రా యూనివర్సిటీ నుంచి మ్యాథమెటిక్స్‌లో పీజీ, కల్‌కత్తా యూనివర్సిటీ నుంచి స్టాటిస్టిక్స్‌లో పీజీ పూర్తి చేశారు. అనంతరం పీహెచ్‌డీ కోసం లండన్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చేరారు. సర్ రోనాల్డ్ ఏ గైడెన్స్‌లో పీహెచ్‌డీని పూర్తిచేసి.. కింగ్స్ కాలేజీలో డీఎస్సీలో డిగ్రీ చేశారు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత కోల్‌కతాలోని ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్, కేంబ్రిడ్జ్ ఆంథ్రోపోలాజికల్ మ్యూజియంలో కొద్ది రోజులు పనిచేశారు.
అనంతరం డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టాటిస్టిక్స్‌ను ప్రారంభించారు. హైదరాబాద్‌లోని సీఆర్ రావు అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్‌లను ఆయనే ఏర్పాటు చేశారు. ఆయన సేవలు కేవలం గణాంక రంగానికే పరిమితం కాలేదు. ఆర్థిక, జన్యు, మానవశాస్త్రం తదితర రంగాలకూ విశేషంగా ఉపయోగపడినట్లు ఇటీవల వెబినార్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 19 దేశాల నుంచి 39 డాక్టరేట్లు అందుకున్న సీఆర్ రావు.. ఇప్పటివరకూ 477 పరిశోధన పత్రాలు సమర్పించారు. 15 పుస్తకాలు రాశారు. 1968లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మ భూషణ్, 2001లో పద్మ విభూషణ్ పురస్కారాలతో సత్కరించింది. 2002లో జార్జ్ బుష్ నుంచి ఆయన నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అందుకున్నారు. స్టాటిస్టిక్స్ టెక్నిక్‌లను అభివృద్ధి చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. క్రామెర్-రావు ఇనిక్వాలిటీ, రావు-బ్లాక్‌వెల్ థియరీ లాంటి టెక్నిక్‌లను అభివృద్ధి చేశారు.