విజయనగరం జిల్లా సాలూరులో ప్రతిష్టాత్మక కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి నేడు శంకుస్థాపన చేయనున్నారు. మెంటాడ, దత్తిరాజేరు మండలాల్లో 561.88 ఎకరాల్లో, రూ. 834 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ విశ్వవిద్యాలయానికి కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమక్షంలో సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఈ విశ్వవిద్యాలయం ఏర్పాటవుతోంది. గిరిజన ప్రాంతంలోనే గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలనే సత్సంకల్పంతో దత్తిరాజేరు మండలం మర్రివలస, మెంటాడ మండలం చినమేడపల్లి పరిధిలోని ప్రభుత్వ,ప్రైవేటు భూమి సేకరించారు. విశాఖపట్నం–రాయగడ జాతీయ రహదారికి సమీపంలో, భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి, విజయనగరం, గజపతినగరం, బొబ్బిలి రైల్వే స్టేషన్లకు అందుబాటులో ఉండేలా స్థలాన్ని ఎంపిక చేశారు. ఇందుకోసం భూములిచ్చిన రైతులకు రూ.29.97 కోట్ల పరిహారం చెల్లించారు. మౌలిక వసతుల కల్పనకు మరో రూ. 28.49 కోట్లు ఖర్చు చేశారు.