ఆరోగ్య శ్రీ సేవలను పొందడంపై ప్రతి ఒక్కొరికీ కూడా అవగాహన కల్పించాలని సీఎం జగన్ సూచించారు. ఇందుకోసం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. సెప్టెంబరు 15 నుంచి ఈ కార్యక్రమం నిర్వహించేందుకు అన్నిరకాలుగా సిద్ధంచేసుకోవాలన్నారు. ప్రతి కుటుంబానికీ కూడా ఆరోగ్య శ్రీ సేవలను ఎలా పొందాలన్న దానిపై సమగ్ర వివరాలతో బుక్‌లెట్ అందిందాలని సీఎం ఆదేశించారు. ఆరోగ్య శ్రీ కింద చికిత్స పొందడం ఎలా? అన్నదానిపై ప్రతి ఒక్కరికీ కూడా అవగాహన ఉండాలన్నారు. విలేజ్ క్లినిక్ సిబ్బంది, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా పూర్తి వివరాలతో సమాచారం అందించాలని సూచించారు. వీళ్లు ప్రతి ఇంటికీ వెళ్లికూడా ఆరోగ్య శ్రీ గురించి సవివరంగా తెలియజేయాలన్నారు. అనారోగ్యం వచ్చినా, దురదృష్టవశాత్తూ ఏదైనా ప్రమాదం జరిగినా ఆరోగ్య శ్రీ కింద ఎలా చికిత్స పొందాలన్నదానిపై పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని సూచించారు. వారు ఉంటున్న ప్రాంతానికి అత్యంత సమీపంలోని నెట్‌వర్క్ ఆస్పత్రిలో ఎలా చికిత్స అందుకోవాలన్నదానిపై అవగాహన ఉండాలి, ప్రజలకూ తెలియజేయాలని ఆదేశాలు జారీ చేశారు.