ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రయాన్-3,,,కీలక బాధ్యతల్లో ఏపీ శాస్త్రవేత్తలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 25, 2023, 07:41 PM

చంద్రయాన్-3తో ప్రపంచ దేశాల ముందు మన దేశం గర్వపడేలా చేసింది ఇస్రో. అయితే ఈ ప్రాజెక్టు విజయవంతం కావడంలో మన తెలుగువారి పాత్ర కూడా ఉంది. సీనియర్లతో పాటుగా యువ సైంటిస్టులు భాగస్వాములుగా ఉన్నారు. గుంటూరు జిల్లా అమృతలూరుకు చెందిన యువ సైంటిస్ట్ బొల్లు మానస కూడా ఈ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉన్నారు. విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై దిగేలా ఇస్రో రూపొందించిన సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ సైంటిస్టుల టీమ్‌లో ఆమె కూడా ఒకరు. చంద్రయాన్‌-3 విక్రమ్‌ ల్యాండర్‌ జాబిల్లిపై అడుగు పెట్టే సమయంలో అందరితో కలిసి పర్యవేక్షిస్తూ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు.


బొల్లు మానస కేరళలోని తిరువనంతపురం ఐఎస్‌టీ కళాశాలలో ఏవియానిక్స్‌ చదివారు. ఉద్యోగరీత్యా తల్లిదండ్రులు వనజకుమారి, అనిల్‌కుమార్‌ గుంటూరులో స్థిరపడ్డారు. 2014లో కోర్సు పూర్తయిన వెంటనే బెంగళూరు ఇస్రో శాటిలైట్ కేంద్రంలో శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు. చంద్రయాన్‌-2 ప్రాజెక్టు సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ విభాగంలో సేవలందించారు. అమ్మానాన్నల ప్రోత్సాహంతో శాస్త్రవేత్తగా ఎదిగి దేశానికి సేవ చేస్తున్నారు. మానస భర్త పవన్‌ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.


చంద్రయాన్‌-3 సక్సెస్‌లో ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పుత్తూరు మండలం ఉన్న తడుకుకు చెందిన అసోసియేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ కల్పన పాత్ర కూడా ఉంది. ఆమె తండ్రి మునిరత్నం చెన్నై హైకోర్టులో అధికారిగా పనిచేసి పదవీ విరమణ చేశారు. తల్లి ఇందిర. కల్పన విద్యాభ్యాసం అంతా చెన్నైలోనే జరిగింది. మద్రాసు విశ్వవిద్యాలయంలో బీటెక్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌లో ఇంజినీరింగ్‌ పూర్తి చేశారు. బీటెక్‌ పూర్తి కాగానే ఉద్యోగ ప్రయత్నాలు మొదలుపెట్టారు. 2000లో ఇస్రోలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది.. దరఖాస్తు చేసుకోగా ఇంజినీర్‌గా ఎంపికయ్యారు. షార్‌లో రాడార్‌ ఇంజినీర్‌గా విధుల్లో చేరారు.. అక్కడే ఐదేళ్లు పనిచేసి.. 2005లో బెంగళూరులోని యూఆర్‌ రావు శాటిలైట్‌ సెంటర్‌కు బదిలీ అయ్యారు. శాటిలైట్ సిస్టమ్స్‌ ఇంజినీర్‌గా శాటిలైట్‌ భవనంలో విధుల్లో చేరారు. ప్రస్తుతం అసోసియేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌గా పని చేస్తున్నారు.


గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన మాజేటి మురళి చంద్రయాన్‌-3లో రాడార్‌ కంట్రోలర్‌ విభాగం జనరల్‌ మేనేజర్‌గా సేవలు అందించారు. రైలుపేటలో స్వీట్ షాప్ నిర్వహించే మాజేటి హనుమంతరావు కుమరుడు మాజేటి మురళి. గ్రామంలోని స్కూల్లోనే చదివారు. ఆయన రష్యాలో బీటెక్‌ ఎలక్ట్రానిక్స్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎం.ఎస్‌.కోర్సు.. ఒక ఏడాది రష్యన్‌ భాష నేర్చుకోవడానికి కలిపి ఆరేళ్లు అక్కడ చదివారు. 1990లో ఆక్కడి నుంచి స్వదేశానికి వచ్చి ఢిల్లీలో ఒక ఏడాది పాటు ప్రైవేటు ఉద్యోగం చేశారు. ఆ తర్వాత షార్‌లో జీఎస్‌ఎల్‌వీ ప్రాజెక్టులో భాగంగా పలువురు శాస్త్రవేత్తలను ఎంపిక చేశారు. ఈ క్రమంలో 1992లో శ్రీహరికోటలో మురళి శాస్త్రవేత్తగా ఉద్యోగంలో చేరారు. క్రయోజనిక్‌ టెక్నాలజీలో నిపుణుడైన మాజేటి మురళి కస్తూరి రంగన్‌ వంటి ఎందరో ప్రముఖులతో కలిసి పనిచేశారు. రాకెట్‌ అసెంబ్లింగ్‌, ఇంధనం నింపే విభాగంలో ఆయన చంద్రయాన్‌-3లో టెస్ట్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ విభాగానికి ఛైర్మన్‌గా సేవలందించారు. అలాగే రాడార్‌ జనరల్‌ మేనేజర్‌గా కూడా ఉన్నారు.


చంద్రయాన్‌-3 ప్రయోగంలో విజయనగరానికి చెందిన డాక్టర్ కరణం దుర్గాప్రసాద్‌ సభ్యుడు. తల్లిదండ్రులు కొండలరావు, శాంతకుమారి, తండ్రి విశ్రాంత రైల్వే ఉద్యోగి. అహ్మదాబాద్‌లోని ఫిజికల్‌ రీసెర్చ్‌ లేబొరేటరీ (పీఆర్‌ఎల్‌)లో ప్లానెటరీ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు. చంద్రయాన్‌-2, 3 మిషన్లలో ఈయన పనిచేశారు. చంద్రయాన్‌-3 ప్రయోగంలో విక్రమ్‌ ల్యాండర్‌ నుంచి బయటకు వచ్చిన రోవర్‌ పర్యవేక్షక బృందాన్ని లీడ్ చేశారు. అలాగే విజయనగరం జిల్లా సంతకవిటి మండలం సిరిపురానికి చెందిన బూరాడ సతీష్‌ కూడా ఇస్రోలో శాస్త్రవేత్తగా సేవలందించారు. చంద్రయాన్‌-3లో కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్తమాధవరానికి చెందిన యువ శాస్త్రవేత్త అవ్వారు చందన కూడా భాగస్వామిగా ఉన్నారు. భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) 2019లో నిర్వహించిన ఐఐఎస్‌టీ పోటీ ప్రవేశ పరీక్షలో ఎంపికయ్యారు. ప్రస్తుతం బెంగళూరులోని యూఆర్‌ రావు శాటిలైట్‌ కేంద్రంలో విక్రమ్‌ ల్యాండర్‌ డిజైనర్‌ విభాగంలో పనిచేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com