ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రపంచాన్ని శాసించే స్థితికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్

national |  Suryaa Desk  | Published : Fri, Aug 25, 2023, 09:43 PM

కృత్రిమ మేధ (ఏI) అభివృద్ధికి వనరు కావచ్చని, ప్రింటింగ్ యంత్రం ఆవిష్కరణ మాదిరిగా భవిష్యత్తుల్లో ప్రపంచానికి ఇది చాలా ముఖ్యమైందని మైక్రోసాఫ్ట్ ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ అన్నారు. కృత్రిమ మేధతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోతారనే అభిప్రాయాలకు విరుద్ధంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. వచ్చే నెలలో ఢిల్లీలో G20 సమ్మిట్‌ జరగనుండగా.. దీనికి ముందు ప్రపంచ వ్యాపార దిగ్గజాలు దేశ రాజధానిలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఓ జాతీయ ఛానెల్‌తో మాట్లాడుతూ... కృత్రిమ మేధ ఉద్యోగ కల్పనకు వనరుగా మారుతుందని అభిప్రాయపడ్డారు.


అంతేకాదు, కృత్రిమ మేధ, చాట్‌జీపీటీ వంటి ఉత్పాదక సాధనాల భవిష్యత్తు గురించి కూడా ఆయన మాట్లాడారు. అవి ఖచ్చితంగా ప్రపంచంలో విప్లవాత్మక మార్పులను తీసుకొస్తాయని అన్నారు. అయితే, AI మానవ నియంత్రణలో ఉండటానికి బలమైన తనిఖీలు, బ్యాలెన్స్‌ల వ్యవస్థ కూడా అవసరమని వివరించారు. ‘ఏI అనేది ప్రజలు తెలివిగా ఆలోచించడం.. మరింత త్వరగా సమాధానాలను కనుక్కోవడానికి సహాయపడే ఒక సాధనం అని నేను భావిస్తున్నాను, కానీ, మనం ఆలోచించడం మానేయకూడదు.. ఏI మనల్ని ఉత్పాదకంగా మరింత విజయవంతం చేయగలదు.. ఇది ఒక భాషను మరొక భాషలోకి అనువదించడంలో సహాయపడుతుంది.. ఇది మరింత వృద్ధికి, ఉద్యోగాల సృష్టికి వనరుగా మారగలదని నేను భావిస్తున్నాను’ అని పేర్కొన్నారు.


ChatGPT, OpenAI అభివృద్ధి చేసిన భాషా నమూనా ఆధారిత చాట్‌బాట్ వంటి ఉత్పాదకాల గురించి స్మిత్ మాట్లాడుతూ.. ‘ఏIగా పిలిచే ఉత్పాదకతను ఇప్పుడిప్పుడే ప్రారంభించాం.. ఇది వ్యాధులను నిర్ధారించడంలోనూ, వ్యాధులను నయం చేయడానికి కొత్త ఔషధాలను కనుగొనడంలో వైద్యులకు సహాయపడుతుంది.. ఇది విద్యార్థులు, తల్లిదండ్రులు వారి పిల్లలతో పని చేయడానికి ట్యూటర్‌లుగా ఉపయోగించవచ్చు... అన్నింటికంటే ఏI అనేది దాదాపు 600 ఏళ్ల కిందట కనుగొన్న ప్రింటింగ్ ప్రెస్‌‌లా భవిష్యత్తుకు అంతే ముఖ్యమైందని నేను భావిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు.


అయితే, మన లక్ష్యం ఏఐ ఎప్పుడూ ప్రమాదాన్ని కలిగించకుండా చూసుకోవడమని ఆయన నొక్కిచెప్పారు. ‘భద్రతా తనిఖీలు, వ్యవస్థలను (ఏI యొక్క ప్రమాదాల నుంచి) రక్షించడానికి సమయం వచ్చినప్పుడు ఏIను ఎల్లప్పుడూ మానవ నియంత్రణలో ఉండేలా చూసుకోవాలి.. .దానిని బాధ్యతాయుతమైన పద్ధతిలో అభివృద్ధి చేయడానికి వ్యవస్థలు అవసరం... దీనికి సంబంధించి అంతర్జాతీయంగా, ప్రతీ దేశం కొత్త చట్టాలు, నిబంధనలకోసం తప్పనిసరిగా దృష్టి సారించాలి’ అని స్పష్టం చేశారు.


ఈ విషయంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని స్మిత్ అభిప్రాయపడ్డారు. ‘ఏI అనేది మాయాజాలం కాదు... ఇది జ్ఞానం.. స్వతంత్ర భావజాలం కాదు. ఇది గణితం.. అది భిన్నంగా ఉన్నప్పుడు సుదూర భవిష్యత్తు ఉండొచ్చని నేను భావిస్తున్నాను... ఈ సాంకేతికత మానవాళికి సేవ చేస్తుంది.. మానవ నియంత్రణలో ఉంటుందని భావించాలి’ అని అన్నారు. ఇక, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలతో సహా వివిధ స్థాయిలు, వివిధ రంగాలలో డిజిటలైజేషన్‌లో భారత్ సాధించిన అద్భుతమైన పురోగతిని కొనియాడారు. ఈ దశాబ్దంలో ఇంత త్వరగా డిజిటల్ చెల్లింపు వ్యవస్థ అభివృద్ధి చెందిన దేశాన్ని చూడలేదన్నారు. ఇప్పుడు కృత్రిమ మేధ అందుబాటులోకి వచ్చినందున దాని సాయంతో మరింత వేగవంతం చేయగలదని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa