అంగారక, శుక్ర గ్రహాలపైకి వెళ్లే సత్తా భారతదేశానికి ఉందని అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ సోమనాథ్ అన్నారు. అయితే అందుకు మనం మరింత ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని చెప్పారు. ఇస్రో ప్రణాళిక గురించి ఓ మీడియా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. అంతరిక్ష పరిశోధనలకు పెట్టుబడుల అవసరం ఉందని, దాని వల్ల అంతరిక్ష పరిశోధన రంగంతోపాటు దేశం కూడా అభివృద్ధి చెందుతుందని, ఇదే తమ లక్ష్యమని చెప్పారు. దేశ అంతరిక్ష రంగ అభివృద్ధి గురించి ప్రధాని మోదీకి దీర్ఘకాలిక ప్రణాళికలు ఉన్నాయని సోమనాథ్ తెలిపారు. ప్రధాని తమకు నిర్దేశించిన భవిష్యత్ లక్ష్యాలను పూర్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
కేరళలోని తిరువనంతపురంలో భద్రకాళి ఆలయాన్ని సోమనాథ్ సందర్శించారు. విక్రమ్ ల్యాండర్ దిగిన చోటుకు శివశక్తి అనే పేరు పెట్టడాన్ని ఆయన సమర్థించారు. శివశక్తి, తిరంగా పేర్లు భారతీయతకు చిహ్నమని అన్నారు. సైన్స్, ఆధ్యాత్మిక అంశాలపై తనకు ఆసక్తి ఉందని చెప్పారు. చంద్రయాన్–3 ల్యాండర్, రోవర్ పనితీరు సంతృప్తికరంగా ఉందని వివరించారు.