మాజీ మంత్రి, రాజకీయ కురువృద్ధుడు చేగొండి హరి రామ జోగయ్య తన పెంపుడు శునకానికి దశ దిన కర్మను ఘనంగా నిర్వహించారు. హరిరామ జోగయ్యకు తన పెంపుడు ‘చాక్లెట్’ అంటే ఎంతో ఇష్టం. తన భార్య చనిపోయాక ఆయనకు ఈ శునకమే ఆసరా అయ్యింది. ఆయన మాములు మనిషి కావడానికి చాక్లెట్ సహకరించింది. చాక్లెట్‌తో ఆయనకు 13 ఏళ్లపాటు ఆయన అనుబంధం ఉంది. ఇటీవల ఆ శునకం చనిపోవడంతో హరిరామ జోగయ్ మనోవేదనకు గురయ్యారు. కుటుంబ సభ్యుల్లో ఒకరిగా చాక్లెట్‌ను భావించే హరిరామ జోగయ్య.. దాని ఆత్మశాంతి కోసం శాస్త్రోక్తంగా పాలకొల్లులోని తన నివాసంలో దశదిన కర్మలు నిర్వహించారు.
ఎవరైనా సరే హరిరామజోగయ్యను ఏమైనా చేస్తారనే అనుమానం వస్తే చాలు.. చాక్లెట్ వారిపై దాడికి దిగేది. దాని బారిన పడిన వారిలో ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. చాక్లెట్‌పై ఉన్న ప్రేమతో ఆయన టామీ చిత్రాన్ని సైతం నిర్మించారు. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో.. ‘టామీ’ సినిమాను తెరకెక్కించారు. శునకాలు మనుషులపై ఎంత ప్రేమగా, విశ్వాసంతో ఉంటాయో చెప్పడం కోసమే ఆయన చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకు వన్నెం రెడ్డి రాజా దర్శకత్వం వహించారు. 2015 మార్చి 13న ఈ సినిమా రిలీజైంది.
ఇక చేగొండి హరిరామజోగయ్య విషయానికి వస్తే ఆయన 1937 ఏప్రిల్ 5న జన్మించారు. ఆయనకు నలుగురు కుమారులున్నారు. 1972-88 మధ్య మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఆయన 1984-85లో హోం మంత్రిగా పని చేశారు. 1990-91లో అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ఆయన.. 1993-95 మధ్య గనులు, పరిశ్రమల మంత్రిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తరఫున నర్సాపురం నుంచి లోక్ సభకు పోటీ చేసి గెలుపొందారు.