ఆయన ఊళ్లో ప్రజలందరికీ చేదోడు వాదోడుగా ఉండేవారు. ఇక భార్యా పిల్లలనైతే కంటికి రెప్పలా కాపాడుకునేవారు. అలాంటి వ్యక్తి గత ఏడాది హఠ్మానరణం చెందారు. తండ్రి మరణాన్ని జీర్ణించకోలేకపోయిన కుమారులు, ఇతర కుటుంబ సభ్యులు.. ఆయన విగ్రహం ఏర్పాటు చేసి ఓ గుడి కట్టి పూజించసాగారు. కుమారుడు చరణ్ ఇటీవల తన పుట్టిన రోజును తండ్రి విగ్రహం వద్దే వేడుకగా జరుపుకున్నాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం వర్రేపాలెం గ్రామానికి చెందిన వర్రే వెంకటేశ్వర రావుకు ఇద్దరు కుమారులు, ఇద్దరు తమ్ముళ్లు. ఆయన ఊరి ప్రజలందరితో స్నేహంగా ఉంటూ.. వారికి ఏ అవసరం వచ్చినా అండగా నిలిచే వారు. అలాంటి వ్యక్తి గత ఏడాది హఠాత్తుగా చనిపోయారు. దీంతో కుటుంబీకులు ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
చిన్నప్పటి నుంచి తన పుట్టిన రోజు వేడుకలను అంగరంగ వైభంగా జరిపించే తండ్రి ఇప్పుడు లేకపోవడంతో.. కుమారుడు చరణ్ ఆయన విగ్రహం వద్దే బర్త్ డే వేడుకలు జరుపుకున్నాడు. తండ్రి భౌతికంగా తమతో లేకపోయినప్పటికీ.. ఆయన జ్ఞాపకాలు, ఆశీస్సులు ఎప్పుడూ మాతోనే ఉంటాయంటూ చరణ్ భావోద్వేగానికి లోనయ్యారు. తండ్రి చనిపోయాక వచ్చిన ఈ మొదటి పుట్టిన రోజును.. తన తండ్రి నిలువెత్తు విగ్రహం వద్ద ఊరి ప్రజలు, స్నేహితుల మధ్య జరిపిన వారందరికీ చరణ్ ధన్యవాదాలు తెలిపాడు.