ఎంతో ప్రతిష్టాత్మకంగా విశాఖ మహా నగరపాలక సంస్థ నిర్మించిన మోడ్రన్ బస్ షెల్టర్ ప్రారంభించిన ఐదు రోజులకే కుంగిపోయింది. జీవీఎంసీ కార్యాలయం ముందు నిర్మించిన ఆర్టీసీ బస్ షెల్టర్ ఒక్కసారిగా శనివారం సాయంత్రం పక్కకు ఒరిగిపోయింది. అయితే, ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ద్వారక బస్ స్టేషన్ దక్షిణంవైపు గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద రూ.40 లక్షల వ్యయంతో బస్‌షెల్టర్‌ను నిర్మించారు. ఎంతో అట్టహాసంగా ఐదు రోజుల కిందట నగర మేయర్ గొలగాని హరి వెంకటకుమారి దీనిని ప్రారంభించారు.
రూ.లక్షలు ఖర్చుచేసి నిర్మించిన నిర్మాణం.. ప్రారంభించిన ఐదు రోజులకే కుంగిపోవడంపై నగరవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో అవినీతి జరిగిందని ప్రతిపక్ష సీపీఎం, జనసేన కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. కుంగిన షెల్టర్ వద్ద వారు ఆందోళన చేపట్టారు. నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మోడ్రన్ బస్ షెల్టర్ పేరుతో రూ.40 లక్షలు వెచ్చించిన నిర్మాణం నాలుగు రోజులు కూడా నిలవలేదని మండిపడుతున్నారు. విశాఖ నగరంలో ఇదే తరహాలో రూ.4 కోట్లతో 20 బస్సు షెల్టర్లను జీవీఎంసీ నిర్మించింది.
ఎవరూ లేని సమయంలో ఘటన జరగడంతో ఎలాంటి ప్రమాదం లేదని.. అదే ప్రయాణికులు ఉన్నప్పుడు ఒరిగి ఉంటే పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. నిర్మాణాలు నాసిరకంగా ఉన్నాయని మండిపడుతన్నారు. బస్ షెల్టర్ల నిర్మాణంలో నాణ్యత పాటించలేదని.. వీటిని కూడా నవరత్నాల ప్రచారం కోసం వాడుకుంటున్నారని జనసేన నేత మూర్తి యాదవ్ మండిపడ్డారు. జగదాంబ, ఆర్టీసీ కాంప్లెక్స్, న్యూ వెంకోజీ పాలెం, పోర్ట్ ఆస్పత్రి, అక్కయ్య పాలెం, ఆర్కే బీచ్, ఏయూ రోడ్డు, తదితర ప్రాంతాల్లో కొత్త బస్ షెల్టర్‌లు ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ వద్ద బస్ షెల్టర్ కుంగిపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.