అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం మండలం చింతపర్తి గ్రామం బజారు వీధిలో నివాసం ఉంటున్న పువ్వాడ వెంకట రమణయ్య శెట్టి ఇంట్లో గత ఏడాది డిసెంబర్ 21న దొంగతనం జరిగింది. ఈ ఏడాది జులై 29న అర్ధరాత్రి సమయంలో కలికిరి పట్టణం అమరనాథరెడ్డి కాలనిలో నివాసం ఉండే రిటైర్ రైల్వే ఉద్యోగి రాజమ్మ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ రెండు చోరీలను సీరియస్‌గా తీసుకున్న అన్నమయ్య జిల్లా పోలీసులు దొంగలను పట్టుకునేందుుక ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. పాత నేరస్థులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించే క్రమంలో.. మేకల గురప్ప (60) ఆయన కొడుకులు మేకల హరివేంద్ర (22), మేకల దేవేంద్ర(25) చోరీలకు పాల్పడినట్లు తేలింది.
పాత నేరస్థుడైన మేకల గురప్ప తన కొడుకులను కూడా చోరీలకు అలవాటు చేశాడు. దీంతో వారు కూడా దొంగలుగా మారారు. ఈ ముగ్గురూ తాళాలు వేసి ఉన్న ఇండ్లను గుర్తించి.. రాత్రి సమయంలో దొంగతనాలు చేసేవారని పోలీసులు తెలిపారు. దొంగతనాలకు పాల్పడిన తండ్రి, ఇద్దరు కొడుకులను అరెస్ట్ చేసిన పోలీసులు.. ముగ్గుర్ని రిమాండ్‌కు తరలించారు. వారి దగ్గర్నుంచి రూ.7.2 లక్షల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారని డీఎస్పీ మహబూబ్ బాషా తెలిపారు.
పువ్వాడ వెంకట రమణ శెట్టి ఇంట్లో చోరీకి గురైన 300 గ్రాముల బంగారు నగలు, రూ.10 వేల నగదును రికవరీ చేశామని.. రాజమ్మ ఇంట్లో చోరీకి గురైన 69 గ్రాముల బంగారు నగలను రికవరీ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. గురప్ప గతంలోనూ దొంగతనాలకు పాల్పడ్డాడని పోలీసులు చెప్పారు. ఈ కేసు వాయల్పాడు సీఐ, కలికిరి ఎస్సై, పోలీసుల బృందాలను డీఎస్పీ అభినందించారు. వారికి రివార్డ్ కోసం ఎస్పీకి సిఫార్సు చేసినట్లు తెలిపారు.