తిరుమల కొండ మీద ఉరుముల మెరుపులతో వర్షం బీభత్సం సృష్టించింది. దీంతో భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో భక్తులు సతమతం అయ్యారు. కానీ సాయంత్రం నుంచి వర్షం మొదలైంది. రాత్రంతా వర్షం కురవడంతో.. తిరుమల కొండ మీద లోతట్టు ప్రాంతాలు జలమయ్యమయ్యాయి. వర్షం కారణంగా స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులు.. దర్శనం అనంతరం బయటకు వచ్చిన వారు సైతం షెడ్ల కిందకు పరుగులు తీశారు.
భారీ వర్షం ప్రభావంతో రాంభగిచా గెస్ట్ హౌస్‌ల వద్ద మోకాళ్ల లోతు వరద నీరు చేరింది. పార్కింగ్ ప్రదేశంలో నిలిపిన వాహనాలు నీట మునిగాయి. మాఢ వీధులు, ఆలయ ముందు భాగం, లడ్డూ కౌంటర్‌తోపాటు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. దీంతో భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. క్యూ లైన్లలో వరద నీరు చేరడంతో భక్తులు నీటిలోనే నడవాల్సి వచ్చింది. శనివారం తిరుమల శ్రీవారిని 71,073 మంది దర్శించుకున్నారు. 37,215 మంది తలనీలాలు సమర్పించారు. స్వామి వారికి 3.67 కోట్ల రూపాయలు విరాళంగా వచ్చాయి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో 29 కంపార్ట్‌మెంట్లలో వేచి చూస్తున్నారు. సర్వ దర్శనానికి దాదాపుగా 24 గంటల సమయం పడుతోంది.