ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చంద్రయాన్ 3 విజయం వెనుక శాస్త్రవేత్తల కఠోర శ్రమ,,,చెల్లి పెళ్లికి కూడా వెళ్లకుండా పనిచేసిన సైంటిస్ట్

national |  Suryaa Desk  | Published : Sun, Aug 27, 2023, 09:50 PM

చంద్రయాన్ 3 ప్రయోగాన్ని జులై 14 వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట నుంచి ప్రయోగించారు. అయితే దానికి ముందు కొన్నేళ్ల నుంచి ఈ ప్రాజెక్టు కోసం ఎంతో మంది ఇస్రో శాస్త్రవేత్తలు నిర్విరామంగా పని చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే చంద్రుడిపై కాలు మోపాలన్న ఆశయంతో ఇల్లు, కుటుంబానికి దూరమై.. రాత్రి, పగలు తేడా లేకుండా పని చేసిన సైంటిస్ట్‌లు ఎంతో మంది ఉన్నారు. అయితే అందులో ఓ శాస్త్రవేత్త తన ఇంట్లో జరిగిన శుభ కార్యానికి కూడా హాజరు కాలేదు. శుభ కార్యం అంటే అలాంటి ఇలాంటి శుభ కార్యం కాదు. చంద్రయాన్ 3 ప్రయోగం కోసం ఏకంగా తన చెల్లి పెళ్లికి కూడా వెళ్లకుండా కష్ట పడ్డారు. ఆయనే చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ డైరెక్టర్ వీరముత్తువేల్.


వివరాల్లోకి వెళ్తే.. చంద్రయాన్‌ 3 ప్రయోగం కోసం ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ పి.వీరముత్తువేల్‌ పని చేశారు. ఈ క్రమంలోనే ఈనెల 20 వ తేదీన వీరముత్తువేల్ సోదరి వివాహం నిశ్చయించారు. అయితే చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ ల్యాండింగ్ సమయం దగ్గర పడటంతో.. ఇస్రో శాస్త్రవేత్తలే కాకుండా యావత్ దేశం మొత్తం ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. ఇక ఈ నెల 23 వ తేదీన జాబిల్లిపై దిగనున్న చంద్రయాన్ 3 ప్రయోగానికి ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా ఉన్న వీరముత్తువేల్‌కు ఎన్నో పనులు ఉంటాయి. ఈ క్రమంలోనే తన చెల్లి పెళ్లికి వెళ్లలేకపోయారు. అయితే ఈ విషయాన్ని వీరముత్తువేల్ తండ్రి పి. పళనివేల్ నేషనల్ మీడియాతో చెప్పారు. వీరముత్తువేల్ స్వస్థలం తమిళనాడులోని విళుపురం. తన కుమార్తె వివాహాన్ని ఈనెల 20 వ తేదీన ఫిక్స్ చేశామని అయితే చంద్రయాన్ 3 ప్రయోగం ఉండటంతో తన కుమారుడు వీరముత్తువేల్ పెళ్లికి హాజరు కాలేకపోయాడని.. పళనివేల్ వెల్లడించారు.


ఈ నెల 23 న చంద్రుని దక్షిణ ధ్రువం మీద విక్రమ్ ల్యాండర్ దిగాల్సి ఉండడంతో ఆ ప్రాజెక్ట్ పర్యవేక్షణలోనే మునిగిపోయి.. వీరముత్తువేల్ పెళ్లికి రాలేదని ఆయన తండ్రి పళనివేల్ చెప్పారు. అయితే చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమై.. చంద్రుని మీద ల్యాండర్‌ విజయవంతంగా దిగగానే తన ఊర్లో సంబరాలు జరుపుకున్నట్లు తెలిపారు. తమ కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, స్నేహితులు సెలబ్రేట్ చేసుకున్నట్లు వివరించారు. వీరముత్తువేల్ తండ్రి పళనివేల్ విశ్రాంతి రైల్వే ఉద్యోగి. చంద్రయాన్ 3 ప్రయోగం ప్రారంభం నుంచి తమ కుమారుడు ఇంటికి రాలేదని.. చివరికి ఆగస్టు 20న చెల్లి పెళ్లి ఉన్నా హాజరుకాలేదని తెలిపారు. తన కుమారుడు చంద్రయాన్‌ 3 ప్రాజెక్టులో భాగమైనందుకు గర్వపడుతున్నాని తెలిపారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com