ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాఖీ కట్టేందుకు తమ్ముడు కావాలన్న కుమార్తె.. బాలుడిని కిడ్నాప్ చేసిన తల్లిదండ్రులు

national |  Suryaa Desk  | Published : Sun, Aug 27, 2023, 09:49 PM

రాఖీ పండగ రోజు ప్రతీ ఆడపిల్ల తన అన్నకు గానీ తమ్ముడికి రాఖీ కట్టాలని భావిస్తుంది. జీవితంలో భయాలను పోగొట్టి ఆపదల నుంచి రక్షిస్తారని నమ్ముతారు. అయితే ఓ బాలిక కూడా గత కొన్ని సంవత్సరాలుగా తన అన్నకు రాఖీ కడుతోంది. అయితే ఇటీవల ఆమె అన్న చనిపోయాడు. దీంతో ఈసారి రాఖీ ఎవరికి కట్టాలని అని ఆ బాలిక తల్లిదండ్రులను అడిగింది. తనకు తన అన్నను మళ్లీ తీసుకురావాలని కోరింది. ఆ తల్లిదండ్రులు బాలికకు సర్ది చెప్తూ సముదాయిస్తూ ఉన్నారు. అయితే మామూలుగానే అడుగుతోందని మొదట అంతగా ఆ తల్లిదండ్రులు పట్టించుకోలేదు. గత కొన్ని రోజులుగా ఆ బాలిక.. అదే పనిగా తనకు అన్న కావాలని.. రాఖీ కడతానని పట్టుబట్టింది. దీంతో ఆ తల్లిదండ్రులు ఒక ఉపాయాన్ని ఆలోచించారు. అయితే అదే ఇప్పుడు వారి పాలిట శాపంగా మారింది. ఎందుకంటే ఆ జంట.. ఓ శిశువును కిడ్నాప్ చేసి పోలీసులకు దొరికిపోవడంతో జైలు పాలయ్యారు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో జరిగింది.


ఢిల్లీలో నివసించే 41 ఏళ్ల సంజయ్ గుప్తా, 36 ఏళ్ల అనిత గుప్తకు ఇద్దరు సంతానం. అయితే వారి 17 ఏళ్ల కుమారుడు ప్రమాదవశాత్తు ఇటీవల చనిపోయాడు. వారికి 15 ఏళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే తన అన్న చనిపోయినా చెల్లి మాత్రం అతడిని మరిచిపోలేకపోయింది. దీంతో ప్రతీసారి అన్నకు రాఖీ కట్టినట్లుగానే ఈ ఏడాది కూడా రక్షాబంధన్‌ రోజున రాఖీ కట్టాలని నిర్ణయించుకుంది. అదే విషయాన్ని తల్లిదండ్రులకు కూడా చెప్పింది. అయితే అన్న చనిపోయాడు ఇక తిరిగి రాడు అని చెప్పినా ఆ బాలిక వినిపించుకోలేదు. దీంతో ఆమె చేసే మారం తట్టుకోలేక ఆ భార్యాభర్తలు ఒక మగ పిల్లాడిని కిడ్నాప్ చేయాలని భావించారు.


దీంతో గురువారం రోజు రాత్రి చట్టా రైల్‌ చౌక్‌ ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న ఓ పేద కుటుంబానికి చెందిన నెల వయసు గల మగ శిశువును కిడ్నాప్‌ చేశారు. శిశువు తల్లి వికలాంగురాలు కాగా.. తండ్రి చెత్త ఏరుకుని కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అయితే తెల్లవారుజామన 3 గంటలకు ఆ తల్లిదండ్రులు లేచేసరికి కుమారుడు కనిపించలేదు. దీంతో 4.30 గంటలకు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తమ కుమారుడిని ఎవరో కిడ్నాప్‌ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇందు కోసం దాదాపు 400 సీసీకెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. అందులో ఓ బైక్‌పై అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించారు. ఆ బైక్ నంబర్ సంజయ్‌ పేరుతో రిజిస్టర్‌ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.


అయితే ఆ బైక్ నంబర్ ఆధారంగా సంజయ్‌ ఉంటున్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు.. అక్కడికి వెళ్లారు. అయితే ఆ ప్రాంతంలో ఎక్కువ మంది నేరగాళ్లు నివసిస్తుండటంతో భారీ బలగాలతో అక్కడికి చేరుకున్నారు. దీంతో సంజయ్ ఇంటికి వెళ్లగా.. అక్కడ కిడ్నాప్ అయిన శిశువుతోపాటు సంజయ్, అనిత దంపతులను కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే కిడ్నాప్ చేయడానికి గల కారణాన్ని పోలీసులు సంజయ్ దంపతులను ప్రశ్నించగా.. అసలు విషయం వెల్లడించారు. తమ కూతురు రాఖీ కట్టాలన్న కోరిక తీర్చేందుకే చిన్నారిని కిడ్నాప్‌ చేసినట్లు అంగీకరించారు. దీంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకొని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అయితే సంజయ్‌పై గతంలో మూడు క్రిమినల్‌ కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com