మద్యం తయారు చేసేందుకే కాదు.. దాన్ని నాశనం చేసేందుకు కూడా అక్కడి ప్రభుత్వం భారీగా డబ్బులు ఖర్చు పెడుతోంది. ప్రజలకు మద్యం అందించేందుకు ఉత్పత్తి కంపెనీలు భారీగా మద్యాన్ని తయారు చేసి పెట్టాయి. దీంతో భారీగా మద్యం నిల్వలు పేరుకుపోయాయి. ఈ క్రమంలోనే ఈ మద్యాన్ని అమ్ముతుంటే తయారు చేసేందుకు పెట్టిన ఖర్చు కూడా చేతికి రావడం లేదంటూ మద్యం ఉత్పత్తి కంపెనీలు వాపోతున్నాయి. ఈ క్రమంలోనే అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కంపెనీల వద్ద ఉన్న పూర్తి మద్యం నిల్వలను కొనుగోలు చేసి వాటిని ధ్వంసం చేసి అందులో నుంచి ఆల్కహాల్‌ను బయటికి తీయాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే మొత్తం మద్యాన్ని కొనేందుకు రూ. 1800 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ఘటన ఫ్రాన్స్‌లో జరిగింది.
ప్రపంచంలో ఎక్కడైనా మద్యాన్ని తాగేందుకు మందుబాబులు తమ జేబులను ఖాళీ చేసుకుంటుండగా.. ఫ్రాన్స్ మాత్రం ఎదురు ఉన్న మద్యం స్టాక్‌ను వదిలించుకోవడానికి శతవిధాలా ప్రయత్నాలు చేస్తోంది. ఇందు కోసం ఏకంగా 200 మిలియన్ యూరోలు అంటే భారత కరెన్సీలో రూ.1800 కోట్లు ఖర్చు అవుతుందని లెక్కలు వేసింది. దీంతో అంత భారీగా ఖర్చు చేసి దేశంలో అదనంగా నిల్వ ఉన్న వైన్‌ను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. ఆ తర్వాత ఆ వైన్‌ను ధ్వంసం చేసి అందులో నుంచి ఆల్కహాల్‌ను బయటికి తీయాలని నిర్ణయం తీసుకుంది. అయితే వైన్‌కు మంచి ధర తీసుకొచ్చేందుకు చేపట్టిన చర్యలో ఇది కూడా ఓ భాగమని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు.. ఫ్రాన్స్‌లో ద్రవ్యోల్బణం, కొవిడ్ ప్రభావంతోపాటు.. క్రాఫ్టెడ్ బీర్‌కు భారీగా డిమాండ్ పెరిగింది. ఈ కారణంగా వైన్ తాగే వారి సంఖ్య తగ్గిపోయి వైన్ ఉత్పత్తి చేసిన సంస్థలు తీవ్ర అవస్థలు పడుతున్నాయి. ప్రముఖ వైన్ కంపెనీలైన బోర్డాక్స్, లాంగ్యూడాక్ సంస్థలు.. ఇప్పటికే భారీగా వైన్‌ను ఉత్పత్తి చేసి పెట్టడంతో సమస్య మరింత తీవ్రమైంది. ఆ కంపెనీల వద్ద తయారు చేసిన వైన్ నిల్వలు భారీగా పేరుకుపోయాయి. దీనికి తోడు మందు బాబుల నుంచి వైన్‌కు డిమాండ్ తగ్గి.. క్రాఫ్టెడ్ బీరుకు డిమాండ్ పెరగడంతో వైన్ ధరలు భారీగా పడిపోయాయి. అయితే తాము ఇప్పటికే భారీగా వైన్ ఉత్పత్తి చేశామని.. కనీసం తయారీకి పెట్టిన ఖర్చులు కూడా వైన్ అమ్మితే రావడం లేదని దాంతో తాము భారీగా నష్టపోతున్నాని లాంగ్యూడాక్ వైన్ ప్రొడ్యూసర్స్ అసోసియేషన్‌కు చెందిన జేన్ ఫిలిప్ప్ గ్రానియర్ ఆవేదన వ్యక్తం చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగ ఆహారం, ఇంధన ధరలు పెరగడంతో ప్రజలు ఖర్చులను భారీగా తగ్గించుకున్నారు. దీంతో వైన్ అనవసర ఖర్చు అని భావించడంతో డిమాండ్ పడిపోయింది.
ఈ క్రమంలోనే ఆయా వైన్ కంపెనీలను ఆదుకునేందుకు ఫ్రాన్స్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే రూ. 1800 కోట్లతో కంపెనీల వద్ద ఉన్న వైన్ స్టాక్ మొత్తం కొనుగోలు చేయనుంది. అనంతరం ఆ వైన్‌ను ధ్వంసం చేసి.. అందులోని ఆల్కహాల్‌ను బయటికి తీయనుంది. అలా సేకరించిన ఆల్కహాల్‌ను వివిధ రకాల ఉత్పత్తులు తయారు చేయడానికి వేరే కంపెనీలకు అమ్మాలని నిర్ణయించింది. వైన్ ధరలు ఇంకా పడిపోకుండా.. ఆయా కంపెనీలు కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకొనేందుకు ఈ రూ.1800 కోట్లను ఖర్చు పెట్టేందుకు సిద్దమైనట్లు ఫ్రాన్స్ వ్యవసాయ శాఖ మంత్రి మార్క్ ఫెస్నో వెల్లడించారు. యూరప్ కమిషన్ గణాంకాల ప్రకారం ఇటలీలో 7, స్పెయిన్‌లో 10, ఫ్రాన్స్‌లో 15, జర్మనీలో 22, పోర్చుగల్‌లో 34 శాతం వైన్ వినియోగం తగ్గినట్లు తెలుస్తోంది.