ఉగ్రవాదం, వేర్పాటువాదం లాంటివి కేవలం జమ్మూ కశ్మీర్‌కే పరిమితం కాలేదని, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలు సహా చాలా ప్రాంతాల్లో ఆ తరహా పరిస్థితి ఉందని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌లపై రోజువారీ విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం కేంద్రానికి పలు ప్రశ్నలు సంధించింది. పంజాబ్, ఈశాన్య రాష్ట్రాలు కూడా ఉగ్రవాదం, వేర్పాటువాదం పీడత రాష్ట్రాలేనని అభిప్రాయపడింది.
‘‘2019లో జమ్మూ కశ్మీర్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించినట్లే.. ఇతర రాష్ట్రాలనూ యూటీలుగా ప్రకటించే అధికారం పార్లమెంట్‌కు, కేంద్రానికి ఉంటుందా?’’ అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరణ ఇస్తుండగా.. ధర్మాసనంలోని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ జోక్యం చేసుకున్నారు. జమ్మూ కశ్మీర్‌లోనే కాదు.. పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఆ తరహా పరిస్థితులు చూస్తున్నాం కదా అని అన్నారు.
ఇదే సమయంలో మరో న్యాయమూర్తి జస్టిస్ గవాయి సైతం మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ గురించి ప్రస్తావించారు. కేవలం సరిహద్దు రాష్ట్రం కావడం వల్ల ప్రత్యేకంగా భావించి, విభజించామనే సమాధానం ఇవ్వకండి అంటూ జస్టిస్ ఎస్కే కౌల్ అసహనం వ్యక్తం చేశారు. దీనికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా బదులిస్తూ.. దశాబ్దాల నుంచి జమ్మూ ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొంటోందని అన్నారు. పైగా పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)తో సరిహద్దు పంచుకుంటోందని, పొరుగు దేశాలు స్నేహపూర్వకంగా లేవని, జమ్మూ విషయంలో కేంద్రం తొందరపాటు ప్రదర్శించలేదని తెలిపారు. అన్ని విధాలుగా పరిశీలన తర్వాతే నిర్ణయం తీసుకుందని, ఒకవేళ గుజరాతో, మధ్యప్రదేశ్‌లను విభజించాల్సి వస్తే అప్పుడు ప్రామాణికాలు వేరుగా ఉంటాయని తుషార్ మెహతా వివరించారు.
ఈ సందర్భగా సీజేఐ చంద్రచూడ్ కలగజేసుకుని.. ‘ఒక రాష్ట్రాన్ని విభజించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అంగీకరించిన తర్వాత.. ఆ అధికార దుర్వినియోగం చేయకుండా ఎలా నిర్ధారిస్తారు... కేంద్రానికో.. లేదంటే పార్లమెంట్‌కో.. ఇప్పుడున్న ప్రతీ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగానో.. విభజన చేయగల అధికారం ఉందా?’ అని ప్రశ్నించారు. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 విషయంలో రాజ్యాంగ పరిషత్ (పార్లమెంట్) పాత్ర కేవలం సిఫార్సుకు మాత్రమే పరిమితం. అలాగని అది రాష్ట్రపతి అధికారాలను భర్తీ చేసేదిగా ఉండకూడద రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. మరోవైపు, జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదా పునరుద్ధరణ విషయంలో ఆగస్టు 31న ఒక స్పష్టమైన ప్రకటన చేస్తామని సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియజేసింది. జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019లో కేంద్రం నిర్ణయం తీసుకుంది. విమర్శలను పక్కనబెట్టి ఆ రాష్ట్రాన్ని లడఖ్, జమ్మూ కశ్మీర్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. అక్కడ పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చాక మళ్లీ రాష్ట్ర హోదా కల్పిస్తామని కేంద్రం అప్పట్లో పేర్కొంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa