ఏపీలో టీటీడీ పాలకమండలి నియామకంపై దుమారం రేగుతోంది. నూతన పాలకమండలి నుంచి ముగ్గురు సభ్యులను తప్పించాలంటూ ఏపీ హైకోర్టులో వరుసగా పిల్స్, పిటిషన్లు దాఖలవుతున్నాయి. క్రిమినల్ కేసులున్న జగ్గయ్యపేట వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఢిల్లీ మద్యం కేసులో నిందితుడు పెనక శరత్‌చంద్రారెడ్డి, అవినీతి ఆరోపణలున్న డాక్టర్ కేతన్ దేశాయ్‌లను టీటీడీ బోర్డులో నియమించడంపై ఏపీ హైకోర్టులో తాజాగా మరో పిల్ దాఖలైంది.
ఆగస్టు 25న ప్రభుత్వం జారీచేసిన జీవో 406.. ఈ ముగ్గురి నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో రైల్వే రిటైర్డ్ ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు కోర్టులో ఈ వ్యాజ్యాన్ని వేశారు. ఈ ముగ్గురి విషయంలో జీవో అమలును సస్పెండ్ చేయాలని కోరారు. దేవాదాయ చట్టంలోని సెక్షన్ 18, 19 లకు విరుద్ధంగా ఈ ముగ్గురి నియామకం ఉందని పిల్‌లో ప్రస్తావించారు. ఉదయభానుపై పది తీవ్రమైన క్రిమినల్ కేసులు ఉన్నాయని.. అలాగే శరత్‌చంద్రారెడ్డి వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శికి బంధువు అన్నారు. ఆయన ఢిల్లీ మద్యం స్కాంలో నిందితుడు అన్నారు.
అలాగే కేతన్ దేశాయ్‌పై తీవ్ర అవినీతి ఆరోపణలన్నాయని.. ఎంసీఐ ఛైర్మన్‌గా అనర్హులంటూ ఆయన్ను ఢిల్లీ హైకోర్టు 2001లోనే తొలగించింది అని పిల్‌లో ప్రస్తావించారు. ఈ ముగ్గురి పూర్వచరిత్ర, వ్యక్తిత్వాలను పరిశీలించకుండా రాష్ట్రప్రభుత్వం రాజకీయ కారణాలతో టీటీడీ పాలకమండలి సభ్యులుగా నియమించింది అన్నారు. ఈ ముగ్గురి విషయంలో జీవో అమలును నిలుపుదల చేయాలని కోర్టును కోరారు. దేవదాయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, టీటీడీ ఈవోతోపాటు వ్యక్తిగత హోదాలో సామినేని ఉదయభాను, పి.శరత్‌చంద్రారెడ్డి, కేతన్ దేశాయ్‌లను ప్రతివాదులుగా చేర్చారు. ఈ జీవోను సస్పెండ్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోర్టును కోరారు.
ఇదిలా ఉంటే.. టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా మిలింద్ కేశవ్ నర్వేకర్, సౌరభ్ బోరా మంగళవారం తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని జేఈవో అందజేశారు.
అలాగే టీటీడీ పాలకమండలి సభ్యులుగా కర్ణాటక రాష్ట్రానికి చెందిన రఘునాథ్ విశ్వనాథ్ దేశ్ పాండే సోమవారం శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం.. ఆ తర్వాత శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని జేఈవో అందజేశారు.
ఆదివారం రోజు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులుగా ముగ్గురు సభ్యులు శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి మొత్తం 28 మందితో టీటీడీ బోర్డు ఏర్పాటైన విషయం తెలిసిందే. వీరిలో తుడా ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యులుగా ప్రమాణస్వీకారం చేశారు. అలాగే ధర్మకర్తల మండలి సభ్యులుగా సుదర్శన్ వేణు, నెరుసు నాగసత్యం ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయంలో స్వామివారి సన్నిధిలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. స్వామివారి దర్శనానంతరం బోర్డు సభ్యులకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం జేఈవో శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని వీరికి అందజేశారు.